ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది

` కేంద్రం పాలన ఫాసిస్టు శైలిలో సాగుతోంది
` మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోంది?
` వారిని నిర్మూలించి అడవులను గంపగుత్తగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోంది
` టీపిసిసిఅధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఫాసిస్టు శైలిలో పాలన సాగుతోంది.‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఇది శాంతి, రాజ్యాంగం పట్ల విధ్వంసకర చర్యగా భావిస్తున్నాం.మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా చలించని ప్రధాని..అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొట్టికాయలు వేస్తే మాత్రం ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధమయ్యారు.పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, మన దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోంది? ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలి. ఇదే ప్రజాస్వామ్యానికి మౌలిక సూత్రం.కాంగ్రెస్‌ పార్టీ అహింస పునాదులపై నిర్మితమైంది. హింస ఎవరి నుంచైనా వస్తే దాన్ని మేము ఖండిస్తాం. గతంలో ఆర్థిక అసమానతలతో నక్సలిజం పుట్టింది. ఆ కాలంలో గ్రామాల్లో జరిగిన అఘాయిత్యాలు నక్సలిజం ద్వారా కొంతవరకైనా తగ్గాయి. కానీ క్రమేణ తప్పుదారి పడుతూ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యక్తిగత కక్షలు తీర్చుకునే ప్రయత్నాలకు వేదికగా మారింది.ఇదే సమయంలో, నక్సలిజాన్ని నిర్మూలించేందుకు శాంతియుత పరిష్కార మార్గాలను పరిశీలించకుండా, శాంతి భద్రత సమస్యను సాకుగా చూపి కేంద్రం ఆపరేషన్‌ కగార్‌ పేరిట దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఈ ఆపరేషన్‌ ద్వారా అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తోంది. మతం, కులం పేరిట రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మత సెంటిమెంట్‌ ను సాకుగా చూపి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లౌకికవాద శక్తులు ఏకమవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో కమ్యూనిజం భావాలు ఉన్నవారు బలపడాలి. దేశం మొత్తం ప్రజాస్వామ్య భావాలు ఉన్న వ్యక్తులు కలిసికట్టుగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్రంలోని ఫాసిస్టు పాలనకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది