భారత్‌లో మరో బర్డ్ ఫ్లూ కేసు
-
దేశంలో రెండో కేసు ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ఓ వైనం
-
పశ్చిమ బెంగాల్‌లో బర్డ్ ఫ్లూ బారినపడ్డ నాలుగేళ్ల బాలుడు
- ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరిక, మూడు నెలల అనంతరం డిశ్చార్జ్
భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి హెచ్9ఎన్2 బర్డ్ ప్లూ వైరస్ బారిన పడ్డట్టు ప్రపంచఆరోగ్య సంస్థ మంగళవారం ధ్రువీకరించింది. భారత్ లో తొలి బర్డ్ ఫ్లూ కేసు 2019లో వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారిని జ్వరం, కడుపులో ఇబ్బంది తదితర సమస్యలతో ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్పించారు. పలు చికిత్సల అనంతరం చిన్నారిని మూడు నెలల తరువాత డిశ్చార్జ్ చేసినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
బాలుడి ఇంటి పరిసరాల్లో కోళ్లు ఎక్కువగా ఉండేవని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే, అతడి కుటుంబం, బంధువుల్లో మరెవరికీ ఈ వ్యాధి సంబంధిత లక్షణాలు లేవని వెల్లడించింది. అయితే, అతడు టీకాలు వేసుకున్నాడా? లేదా? ఆసుపత్రిలో ఏ యాంటీ వైరల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారనే వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవని పేర్కొంది.
హెచ్9ఎన్2 వైరస్‌తో వ్యాధి లక్షణాల తీవ్రత ఓ మోస్తరుగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే, అధికంగా వ్యాప్తిలో ఉన్న వేరియంట్లలో ఇదీ ఒకటని వెల్లడించింది. అయితే, దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది.