నిత్యావసర సరుకుల ధరలు – ఆకాశాన్ని తాకుతుంటే సామాన్యులు బ్రతుకేదేట్ల?

హయత్ నగర్, మే 06 (జనం సాక్షి): కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ హయత్‌నగర్ మండలంలోని లెక్చరర్స్ కాలనీ డివిజన్ కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి, ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి లు హాజరై, ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా రవీంద్రాచారి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పేదల జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ సందర్బంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కమర్షియల్ సిలిండర్ ధరను అమాంతం పెంచేయడం పరోక్షంగా చిరు వ్యాపారులను, హోటళ్లు, టీ స్టాళ్ల నిర్వాహకులను రోడ్డున పడేయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే సామాన్యులు ఎలా బతకాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించి సామాన్యులకు ఉపశమనం కలిగించకపోతే.. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లెక్చరర్స్ కాలనీ డివిజన్ అధ్యక్షులు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, హై కోర్ట్ కాలనీ డివిజన్ కార్యదర్శి చెంది వెంకట్, ఏఐటీయూసీ మండల అధ్యక్ష, కార్యదర్శులు పట్టేటి శేఖర్, గోల్కొండ నాగరాజు, బీసీ సంఘం మండల కార్యదర్శి కొండ బాలరాజు, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఇసంపల్లి వెంకటేష్, బిఓసి నాయకులు సామెల్, రమేష్, రాములు, సిపిఐ వీరన్న గుట్ట నాయకులు అంబల రాములు, నీలం నవీన్, లస్కర్ కృష్ణ, సుమతి, కళ్యాణి, లక్ష్మీ, వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు.



