ఎంజిఎం కార్డియాలజీలో అసౌకర్యాలు

share on facebook

గుండెపోటుతో వస్తే అంతే సంగతులు
వరంగల్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : మానవుడి జీవనశైలి గుండెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయక పోవడం, మానసికి ఒత్తిడితో గుండె ప్రమాద స్థితికి చేరుకుంటోంది. మానవుడి శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. ఇక్కడి నుంచే అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంది. అంతేగాకుండా గుండె అన్ని అవయావాలకు అనుసంధానించబడి ఉంటుంది. ప్రస్తుతం గుండె సంబధిత వ్యాధులు పెరిగిపోయాయి. చికిత్స అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ఈ వ్యాధి పేద మధ్యతరగతి వర్గాలకు వస్తే ఇక అంతే సంగతులు. దేవుడి విూదే భారం వేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో హైదరాబాదు తర్వాత పెద్దదైన వరంగల్‌ నగరంలోని పెద్దాసుపత్రి అయిన ఎంజీఎంలో గుండె చికిత్సకు అవసరమైన సౌకర్యాలు లేవు. వైద్యులు కూడా సరిపడా లేకపోవడం రోగులకు శాపంగా మారింది. 60 పడకలున్న కార్డియాలజీ విభాగంలో ఈమేరకు సౌకర్యాలు లేవు. కేవలం ఆరు పడకలు మాత్రం ఐసీయూలో ఉంచారు. గుండె వ్యాధిగ్రస్థులకు వైద్యం అందించేందుకు సరైన పరికరాలు లేవు. కనీస పరీక్షలు చేసే పరిస్థితి కూడా లేదు. రోగులకు టీఎంటీ, ఎకో, ట్రాప్‌టీ, సీపీవో వంటి పరీక్షలు చేయాలి. ఎంజీఎం సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగంలో నలుగురు వైద్యులు ఉండాల్సిన అవసరం ఉంది.. కాని ఆ విభాగంలో ఒక్క డాక్టరే విధుల్లో ఉన్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన 14 మంది టెక్నీషియన్లు అవసరముండగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. ఎంజీఎంకు రోజుకు వెయ్యి నుంచి 15 వందల మంది రోగులు వస్తుంటారు. అందులో 40 శాతం గుండె నొప్పితో భాదపడే వారు ఉంటారు. వారిని ప్రథమ చికిత్స చేసేందుకు తొలుత ఈసీజీ చేయాలి. కాని ఆసుపత్రిలో దాతలు ఇచ్చిన 10 ఈసీజీలకు 3 మాత్రమే పని చేస్తున్నాయి. మిగితా 7 ఈసీజీలు మూలకు పడేశారు. ఇంత మంది రోగులకు ఈసీజీలు చేయాలంటే 3 పరికరాలు సరిపోక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈసీజీ కోసం గంటల తరబడి నిరీక్షించవలసి వస్తోందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఎం ఉన్నతధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అవసరమైన సిబ్బందిని నియమించి పరికరాలను కొనుగోలు చేసేలా చూడాలని రోగులు కోరుతున్నారు.

Other News

Comments are closed.