ఎసిబికి చిక్కిన గూడూరు తహసిల్దార్‌ హసీనాబీ

share on facebook

కర్నూలు,నవంబర్‌8 (జనంసాక్షి) : భూ సమస్య పరిష్కారం కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 4 లక్షలు లంచాన్ని డిమాండ్‌ చేసిన కర్నూలు జిల్లా గూడూరు తహసిల్దార్‌ హసీనాబీ ఎసిబి కి దొరికిపోయిన వైనం శుక్రవారం చోటు చేసుకుంది. గూడూరుకు చెందిన సురేష్‌ అనే వ్యక్తి తన భూ సమస్య పరిష్కారం కోసం తహసీల్దార్‌ హసీనాబీ ని నెల క్రితం కార్యాలయంలో సంప్రదించాడు. అయితే భూ సమస్య పరిష్కారం కోసం తనకు రూ.4 లక్షలు లంచంగా ఇవ్వాలని తహసీల్దార్‌ డిమాండ్‌ చేయడంతో కలత చెందిన సురేష్‌ ఏసీబీ ని ఆశ్రయించాడు. ఆ తర్వాత తహసీల్దార్‌ కోరిన మేరకు రూ. 4 లక్షలు తీసుకొని గురువారం రాత్రి పాణ్యం బస్టాండ్‌ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే తహసీల్దార్‌ తాలూకు చెందిన మహబూబ్‌ భాష అనే వ్యక్తి సురేష్‌ నుంచి సొమ్ము తీసుకునే యత్నంలో ఉండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతఅత్వంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మహబూబ్‌ భాషను రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. తహసీల్దార్‌ ఆదేశించిన మేరకు ఆ సొమ్మును తీసుకునేందుకు వచ్చినట్లు మహబూబ్‌ బాషా ఏసీబీ అధికారులకు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత తహసీల్దార్‌ హసీనాబీ ని అరెస్టు చేసేందుకు ఏసీబీ అధికారులు యత్నించగా విషయం తెలుసుకున్న ఆమె అప్పటికే పరారైనట్లు అధికారులు తెలిపారు. గతంలో ఈమె నంద్యాల డిప్యూటీ తహసీల్దార్‌ గా కూడా పని చేశారు.

Other News

Comments are closed.