ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయింది

share on facebook

– దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచాం
– నిధుల ఖర్చు విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది
– వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చుచేశాం
– వినూత్నమైన పథకాలను అమలు చేస్తున్నాం
– 1,46,492కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కేసీఆర్‌
– రైతుబంధు, పంటల రుణాల మాఫీకి నిధులు కేటాయింపు
– ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేస్తామన్న సీఎం
– ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ ఎన్నోరెట్లు మేలన్న కేసీఆర్‌
– ఆరోగ్యశ్రీకి ఏడాదికి 1,336 కోట్లు కేటాయింపు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) : ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపైందని, రెండేళ్లకు ముందు 4.2శాతం ఉన్న జీస్‌డీపీ.. 2018-19లో 10.5శాతానికి పెరిగిందని రాష్ట్ర సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేసీఆర్‌ స్వయంగా రూ. 1,46,492.3కోట్లతో రాష్ట్ర బ్జడెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు, బ్జడెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు, రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లుగా చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తోందన్నారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు… యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరిచాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటుకు రెండేళ్లకు ముందు 4.2శాతం ఉన్న జీఎస్‌డీపీ.. 2018-19లో జీఎస్‌డీపీ 10.5శాతానికి పెరిగిందన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయిందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మూలధన వ్యయంలో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. నిధుల ఖర్చులో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాటా తక్కువగా ఉండేదన్నారు. 16.3శాతం మూలధనం వ్యయంతో తెలంగాణ అగ్రస్థానాన్ని ఆక్రమించిందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. మూలధనం వ్యవయంలో కేంద్రానిది కేవలం 12.8 శాతం అని.. గత ఐదేళ్లలో మూలధనం కింద రూ.1,65, 167 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణలో సగటు ఆదాయ వృద్ధి రేటు 21.49 శాతం అని.. సమర్ధవంతమైన ఆర్థిక నిర్వహణతో అద్భుతాలు వస్తాయని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ 24 గంటల పాటు ఇవ్వడంతో… పారిశ్రామిక, వ్యవసాయరంగం పునరుత్తేజం సాధించాయని తెలిపారు. రైతుబంధు పథకం వ్యవసాయరంగానికి తోడ్పాటునందించిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించామన్నారు. వ్యవసాయరంగంలో 8.1శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 1.8 శాతం నుంచి 6.3శాతం వృద్ధి సాధించామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పారిశ్రామికరంగంలో 5.8 శాతం వృద్ధి రేటు.. సేవలరంగంలో 11.8శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. 2014-15లో ఐటీ ఎగుమతులు రూ.52 వేల కోట్లు అని.. 2018-19 నాటికి రూ.లక్షా 10 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు. తెలంగాణలో కనీవినీ ఎరుగుని రీతిలో విద్యుత్‌ ఉత్పాదన జరిగిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.
అట్టడుగు నుండి.. అగ్రస్థానంలో నిలిచాం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) సగటు
వృద్ధిరేటు రెట్టింపైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జీఎస్‌డీపీ సగటు వృద్ధి రేటు కేవలం 4.2శాతం మాత్రమే ఉంటే.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అది రెండు రెట్లకు పైగా పెరిగి 10.5 శాతంగా నమోదైందని అన్నారు. స్వరాష్ట్రంగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంత దృఢంగా మారిందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని కేసీఆర్‌ బ్జడెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్టాభ్రివృద్ధి కోసం, ఆస్తుల కల్పన కోసం వెచ్చించే మూలధన వ్యయంలో ఎక్కడో అట్టడుగున ఉండే తెలంగాణ.. నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో మూలధన వ్యయం మొత్తం వ్యయంలో కేవలం 11.2 శాతం మాత్రమేనని, నిధుల వినియోగంలో ఎదురైన వివక్ష కారణంగా సమైక్య రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడి వ్యయంలో తెలంగాణకు దక్కిన వాటా మరింత తక్కువగా ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల మూల ధన వ్యయం క్రమంగా పెరుగుతూ వచ్చిందని, గడిచిన ఆర్థిక సంవత్సరంలో 16.9 శాతం మూలధన వ్యయంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచిందని కేసీఆర్‌ వివరించారు.
కేంద్రం తిరిగి ఇచ్చింది 31వేల కోట్లే..!
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రాష్టాన్రికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకునేది ఎక్కువ ఇచ్చేది తక్కువ అని సీరియస్‌ అయ్యారు. ఐదేళ్లలో పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రం 2లక్షల 72 వేల కోట్ల రూపాయలు తీసుకుంటే.. రాష్టాన్రికి కేవలం 31వేల 800 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని కేసీఆర్‌ చెప్పారు. ఇది కరెక్ట్‌ కాదని అన్నారు. కేంద్రం తీరుతో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంపై మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. మోడీ సర్కార్‌ సహకరించక పోయినా.. రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తోందని చెప్పారు. దేశంలో ఆర్థిక మాంద్యం గురించి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దేశానికి మంచిది కాదన్నారు. గడిచిన ఏడాదిన్నరగా దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉందని కేసీఆర్‌ చెప్పారు. జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిందని కేసీఆర్‌ అన్నారు. 2019 తొలి తైమ్రాసికంలో కేవలం 5శాతమే వృద్ధి నమోదైందన్నారు. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గిందన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారని వెల్లడించారు. 11శాతం విమాన ప్రయాణికుల సంఖ్య పడిపోయిందన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగాణ బ్జడెట్‌ లో కేటాయింపులు తగ్గించాల్సి వచ్చిందన్నారు.
రుణమాఫీకి రూ. 6000 కోట్లు..
ముఖ్యం ఎన్నికల్లో హవిూఇచ్చిన రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ బ్జడెట్‌ ప్రసంగంలో స్పష్టం చేశారు. పంట రుణాల మాఫీ కోసం బ్జడెట్‌లో రూ. 6000వేల కోట్లు కేటాయించారు. అయితే, రుణమాఫీని ఒకే విడతలో చేస్తారా? లేదా గతంలో చెప్పినట్లు మళ్లీ నాలుగు విడతల్లో చేస్తారా అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే గత ఆరు నెలల్లో రుణ మాఫీపై ఎలాంటి ప్రకటన
చేయకపోవడంతో రైతులపై బ్యాంకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చేసిన కేటాయింపులతోనైనా రుణమాఫీ అమలు అవుతుందని భావిస్తున్నారు.
రైతుబంధుకు రూ. 12వేల కోట్లు..
రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే మొత్తాన్ని రూ. 8000 నుంచి రూ. 10000 పెంచడమే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతుబంధు పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుత బ్జడెట్లో రైతు బంధు పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి రూ. 1137 కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.
విద్యుత్‌ సబ్సిడీలకు రూ.8000 కోట్లు ..
ప్రస్తుతం వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న భారీ నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడానికి అయ్యే విద్యుత్‌ బిల్లుల భారం రైతులపై పడకుండా ప్రభుత్వమే చెల్లిస్తుందని హావిూ ఇచ్చారు. దీంతో వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీల కోసం వెచ్చించే వ్యయం పెరిగిందన్నారు. విద్యుత్‌ సబ్సీడీల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బ్జడెట్‌లో రూ. 8000 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇదిలాఉంటే రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ కోసం ఇప్పటి వరకు రూ. 20,925 కోట్లు కేటాయించామని, ఉదయ్‌ పథకం ద్వారా రుణభారం రూ. 9,695 కోట్లు ప్రభుత్వమే భరించిందని తెలిపారు. విద్యుత్‌ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించిందని కేసీఆర్‌ అన్నారు.
త్వరలోనే అమలు 57ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్‌..
రాష్ట్రంలోని పేద ప్రజలకు అందించే ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్స్‌, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆరు కిలోల బియ్యం లాంటి సంక్షేమ పథకాలకు ఎలాంటి నిధుల కొరత రానివ్వమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆసరా పెన్షన్లను రెట్టింపు చేశాం. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు, ఒంటరి మహిళలు, నేత-గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల పెన్షన్‌ను రూ. వెయ్యి నుంచి రూ. 2,016కు పెంచాం. వికలాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్‌ను రూ. 1500 నుంచి రూ. 3,016కు పెంచామన్నారు. అయితే ఆసరా పెన్షన్ల ప్రయోజనాలు మరింత విస్తృత పరిధిలో అందించడం కోసం ప్రభుత్వం మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నదని సీఎం స్పష్టం చేశారు. వృద్దాప్య పెన్షన్‌ వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాం. త్వరలోనే 57 సంవత్సరాలు నిండిన వారందరికీ వృద్దాప్య పెన్షన్‌ లభిస్తుంది. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ను కూడా ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. ఆసరా పెన్షన్ల కోసం ఈ బ్జడెట్‌లో రూ. 9,402 కోట్లు కేటాయించామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.
శాంతి భద్రతలు పటిష్టానికి ప్రత్యేక చర్యలు..
రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను కూడా ప్రభుత్వం పునర్‌ వ్యవస్థీకరించిందని తెలిపారు. కొత్తగా 7 పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసి.. ప్రభుత్వం వాటి సంఖ్యను తొమ్మిదికి పెంచిందని పేర్కొన్నారు. పోలీసు సబ్‌ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717కు పెంచినట్లు సీఎం తెలిపారు. కొత్తగా 102 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో మొత్తంగా పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కు పెంచినట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు.
క్షేత్రస్థాయిలోకి ప్రభుత్వ ఫలాలు..
రాష్ట్రంలో పాలనాపరంగా ఇబ్బందులు లేకుంటా ఎక్కడికక్కడ మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని, తద్వారా ప్రభుత్వపాలన పేదల దరికిచేరేలా చ్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 43రెవెన్యూ డివిజన్లను 69కి పెంచాంమపని, 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నామని అన్నారు. గతంలో 68 మున్సిపాలిటీలు ఉంటే వాటి సంఖ్యను 142కు పెంచుకున్నామని, కొత్తగా 7 మున్సిపల్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుని, 13కి పెంచుకున్నామని తెలిపారు. గతంలో 8,690 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రస్తుతం 12,751 గ్రామపంచాయతీలు ఉన్నాయని, రెవెన్యూ డివిజన్లలో 28 డీఎల్పీవోల సంఖ్యను 68కి పెంచామని కేసీఆర్‌ పేర్కొన్నారు.  గ్రామపంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు కేటాయింపులు, ఆరోగ్య శ్రీకి ఏడాదికి రూ. 1,336 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు కేటాయింపులు చేసినట్లు సీఎం తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు చేశామని, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమే నని అన్నారు. ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆదాయం తగ్గినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బ్జడెట్‌ రూపకల్పన చేశామని, రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరం రాలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. జులై నెలలో తీసుకున్న జీఎస్టీ పరిహారం ఏప్రిల్‌, మే నెల కంటే 4 రెట్లు ఎక్కువ అని, గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ అంచనాలకు నేటికి చాలా వ్యత్యాసముందన్నారు. కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 1.36 శాతం మాత్రమే వృద్ధి సాధ్యమైందదని, దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందన్నారు. వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయని, రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందని కేసీఆర్‌ తెలిపారు.
ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ ఎన్నోరెట్లు మేలు..
కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయగలవని భావించిన కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకం.. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా ఎంతో విశిష్టమైనది అని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందన్నారు. కానీ ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ. 250 కోట్ల విలువైన వైద్య సేవలు మాత్రమే అందుతాయి. ఆరోగ్య శ్రీ ద్వారా 85 లక్షల 34 వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు కలిగే అవకాశం ఉందన్నారు సీఎం కేసీఆర్‌. ఆరోగ్య శ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా అందవు అని తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ కన్నా ఆరోగ్యశ్రీ పథకం ఎన్నో రెట్లు మెరుగైనది. కాబట్టి కేంద్ర పథకాన్ని మనం వద్దు అనుకున్నామని సీఎం చెప్పారు.
—————————————

Other News

Comments are closed.