కరోనాపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిపోరు

share on facebook

– మరో ఏడాది అప్రమత్తత తప్పదు

-డబ్ల్యూహెచ్‌వో..

న్యూయార్క్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి):కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఒకే ముప్పు ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు ప్రాణాలను కాపాడటం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని గుటెర్రస్‌ అన్ని దేశాలకూ పిలుపునిచ్చారు. ‘అంతర్జాతీయ సమాజం ఒక్కతాటిపై వచ్చి కరోనా మహమ్మారిని ఓడించాల్సిన సమయం ఇది. చాలామంది వ్యాక్సిన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఒక్కటి మాత్రం స్పష్టం చేస్తున్నాను. ఇలాంటి మహమ్మారిలు విజృంభించినప్పుడు సర్వరోగనివారిణి అనే ఔషధం ఉండదు. కేవలం వ్యాక్సిన్‌ ఒక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారం చూపించదు. ఈ సవిూప కాలంలో అది సాధ్యం కాకపోవచ్చు కూడా’ అని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ గుటెర్రస్‌ స్పష్టంచేశారు. రాబోయే 12నెలలు ఎంతో కీలకమైనవని, ఈ సమయంలో కొత్త కేసులను గుర్తించడంతో పాటు నూతన చికిత్సా పద్ధతుల ద్వారా వైరస్‌పై పోరు కొనసాగించేందుకు ప్రపంచదేశాలు కృషిచేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పదిలక్షలకు చేరడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రస్తుతం మహమ్మారి నియంత్రణలో లేకుండా పోయిందన్నారు.జీవితంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఇప్పుడు చూస్తున్నామని..ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారాలు జరగడం దురదృష్టకరమన్నారు. దీంతో కొందరు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి నిరాకరించే అవకాశం ఉన్నట్లు వస్తోన్న నివేదికలు ఆందోళనకు గురిచేస్తున్నాయని గుటెర్రస్‌ అన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో మానవాళి మంచికోసం వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఈ సమయంలో తక్కువ ధరలో, ప్రపంచవ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. దీనిలోభాగంగా అూహంచీ కార్యక్రమానికి తోడ్పాటునందించాలని ప్రపంచదేశాలకు ఐరాస చీఫ్‌ సూచించారు. ప్రపంచంలో ఏ వ్యాక్సిన్‌ సురక్షితమని తేలినా.. దాన్ని తీసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.అమెరికాతో పాటు విశ్వవ్యాప్తంగా కరోనా విజృంభణ కారణంగా సెప్టెంబర్‌ 15న ప్రారంభమైన యూఎన్‌జీఏ 75వ వార్షిక సమావేశాలు వర్చువల్‌ పద్ధతిలో జరుగుతున్నాయి.

Other News

Comments are closed.