క్యాబ్‌పై ఎవరూ ఆందోళన పడొద్దు

share on facebook

– విూ హక్కులను ఎవరూ హరించలేరు
– అసోం ప్రజలకు ట్విటర్‌లో మోదీ హావిూ
న్యూఢిల్లీ, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : క్యాబ్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విూ హక్కులను ఎవరూ హరించలేరని ప్రధాని మోదీ అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగిన నేపథ్యంలో నరేంద్రమోదీ ట్విటర్‌లో స్పందించారు. క్యాబ్‌పై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, విూ హక్కులను ఎవరూ హరించలేరని అసోం ప్రజలకు హావిూ ఇచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లుపై అసోం సోదరసోదరీమణులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విూ హక్కులను, ప్రత్యేకమైన గుర్తింపును, అందమైన సంస్కృతిని ఎవరూ హరించలేరని, ఆ సంస్కృతి, గుర్తింపు వృద్ధి చెందుతూనే ఉంటాయన్నారు. అందుకు నాదీ హావిూ అని మోదీ తెలిపారు. అసోం ప్రజల రాజకీయ, భాషా, సాంస్కృతిక, భూ హక్కులను రాజ్యాంగబద్ధంగా పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం, నేను పూర్తిగా కట్టుబడి ఉన్నామని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పొరుగు దేశాల్లో మతపరమైన పీడనకు గురై భారత్‌లో ఆశ్రయం కోరి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
మోదీజీ విూ ట్వీట్‌ వాళ్లు చదవలేరు – కాంగ్రెస్‌
పౌరసత్వ సవరణ బిల్లు(క్యాబ్‌) గురించి మోదీజీ విూరు హావిూ ఇస్తూ చేసిన ట్వీట్‌ను అసోం ప్రజలు చదవలేరంటూ కాంగ్రెస్‌ చురకలు వేసింది. బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ క్యాబ్‌పై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ ట్విటర్‌ వేదికగా ఆయన అసోం ప్రజలకు హావిూ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది. మోదీజీ అసోంలో ఉన్న మన సోదర, సోదరీమణులకు విూరు హావిూ ఇస్తూ చేసిన ట్వీట్‌ను వాళ్లు చదవలేరని, విూరు మరిచిపోయినట్లున్నారని, అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారంటూ కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది.

Other News

Comments are closed.