నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

share on facebook

ఇందుకు అందరూ ముందుకు రావాలి
నిజామాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం దేశంలోని 256 జిల్లాల్లో జూలై 1 నుంచి జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిందని కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్‌ సమన్వయ కర్త డాక్టర్‌ ఆర్‌వీఐ బాలాజీ నాయక్‌  అన్నారు. భవిష్యత్తులో సాగు,తాగు నీటికి ఇబ్బందులు రాకుండా వర్షపు నీటిని చక్కగా వినియోగించుకొని భూగర్భ జలాలు పెంపొందించే చర్యల్లో భాగంగా వనరులను ఉపయోగించుకొని ముందుకు పోవాలన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి అడుగంటి పోతున్న భూగర్భ జలాలను కాపాడు కుందామని పిలుపునిచ్చారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కార్యక్రమాలు సాగుతున్నాయని అన్నారు.  ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు సమిష్టిగా పాటుపడితే ఫలితాలు సాధించవచ్చన్నారు. ఒక్క అధికార యంత్రాంగంతోనే సాధ్యం కాదని, ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు అందరి సమష్టి కృషి ఉంటేనే విజయం సాధిస్తామని అందుకు ప్రతి ఒక్కరూ జలశక్తి అభియాన్‌లో భాగస్వాములు కావాలన్నారు. రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిచేందుకు మెట్ట భూములు ఆరుతడి పంటలు వేసుకోవాలని, పంట మార్పిడి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వర్షాపాతం బాగా పడిపోయిందన్నారు. నీటి రక్షణ పొదుపుపై అవగాహన పెంచుకోవాలని కోరారు.  నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు, కందకాలు, ఉట కందకాలు నిర్మించుకోవాలన్నారు. గ్రామాల్లో నీటి నిలువ, వాటి సంరక్షణ ప్రత్యేకించి తాగునీటికి ఇంకుడుగుంత, ప్రతిరైతు పొలంలో ఒక ఫాంపాండ్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Other News

Comments are closed.