ప్రజల అవసరాలు తీర్చడమే..

ప్రభుత్వ బాధ్యత
నగరంలో 10జోన్లు, 50 డివిజన్లు ఏర్పాటుకు చర్యలు
కేసీఆర్‌ ఆమోదంతో కోత్త జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేస్తాం
మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
ఇంకుడు గుంతలు ఉంటే పన్నుల 5శాతం రాయితీ
అందరం బాధ్యతగా వ్యవహరించి విశ్వనగరంగా తీర్చిదిద్దుకుందాం
‘మన నగరం’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : ప్రజల అవసరాలను తీర్చడమే ప్రభుత్వం బాధ్యత అని, ఆ మేరకు తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎల్బీనగర్‌ నాగోల్‌లోని దేవకి కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం ‘మననగరం’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రజల చెంతకు పాలన తీసుకురావడానికే మననగరం కార్యక్రమం అన్నారు. హైదరాబాద్‌లో 10జోన్లు, 50 డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నమన్నారు. త్వరలోనే సీఎం ఆమోదంతో కొత్త జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేస్తమని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రజల సొమ్ముకు తాము ధర్మకర్తలం మాత్రమేనని, ప్రజలు ఆదాయపన్ను సక్రమంగా చెల్లించాలని కేటీఆర్‌ కోరారు. నగరవాసులు కోరుకునే నాణ్యమైన జీవనం అందించేందుకు కృషి
చేస్తున్నామని, పౌరులు చెల్లించే పన్నులతోనే నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన తడి, పొడి చెత్త బుట్టలను తప్పకుండా వినియోగించాలని కేటీఆర్‌ కోరారు. ఇంకుడు గుంతలు నిర్మించుకున్న వారికి ఆస్తిపన్నులో 5శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. నీటి సంరక్షణ కోసం జలం-జీవం అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. హరితహారంలో కూడా ప్రజల భాగస్వామ్యం పెరగాలన్నారు. మొక్కలు పెంచేది సీఎం కోసమో, ప్రజాప్రతినిధుల కోసమో కాదని, చెట్ల పెంపకం వల్ల మొత్తం సమాజానికి మేలు జరుగుతుందని కేటీఆర్‌ వెల్లడించారు. పార్కులను అభివృద్ధి చేస్తామని, వాటిని స్థానికులు దత్తత తీసుకోని పరిశుభ్రంగా ఉంచుకొనేలా చూసుకోవాలని కేటీఆర్‌ సూచించారు. నగరంలో రోజుకు 500 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని, ఈ చెత్తతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని కేటీఆర్‌ అన్నారు. అంతకు ముందు ఎల్బీనగర్‌లో జరుగుతున్నఅభివృద్ధిపై మంత్రి బ్రోచర్‌ విడుదల చేశారు. నాగోల్‌లో ఇంకుడు గుంతల ఏర్పాటు, హరితహారంలో భాగంగా జరుగుతున్న మొక్కల పెంపకాన్ని కేటీఆర్‌ పరిశీలించారు ఈకార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పలువురు ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.