ప్రతీ మహిళకు ఉజ్వల భవిష్యత్తును కల్పించే పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్

share on facebook

రాష్ట్రంలోని ప్రతీ మహిళను సొంత ఆడపడుచులా భావిస్తున్నాం
• రాఖీపండుగ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ కట్టాలి
• సీఎం కేసీఆర్‌ హయాంలో పదిరెట్లు పెరిగిన పెన్షన్
• రాఖీపండుగ సందర్భంగా ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో కేటీఆర్ జూమ్ మీటింగ్
• 14 లక్షల ఒంటరి, వితంతు మహిళలతో పాటు 4 లక్షల మహిళా బీడీ కార్మికులకు పెన్షన్‌
• స్త్రీల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

 

ఎల్లవేళలా సోదరికి అండగా నిలుస్తానని సోదరుడు చేసే ప్రమాణానికి ప్రతీకే రక్షాబంధన్ అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారకరామారావు. రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఉజ్వల భవిష్యత్తును కల్పించే పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా ఉన్నారని చెప్పారు. అందుకే రాఖీ పండుగ నాడు కేసీఆర్ చిత్రపటానికి ఆడబిడ్డలంతా రాఖీకట్టాలని కోరారు. రాఖీ పండుగను పురస్కరించుకొని 33 జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో జూమ్ కాల్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ హయాంలో పెన్షన్‌ పదిరెట్లు పెరిగిందన్న కేటీఆర్ , 14 లక్షల ఒంటరి, వితంతు మహిళలతో పాటు నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి అర్హులైన మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు 2,016 రూపాయల చొప్పున పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.
మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమని నమ్ముతున్న ప్రభుత్వం తమది అని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉద్యమకాలం నుంచి తమకు అండగా ఉన్న మహిళల ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. శిశువుల నుండి వృద్ధుల వరకు ప్రతీ స్త్రీ కి అండగా ఉండి వారి అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములుగా ఉన్నామని చెప్పుకునేందుకు గర్వంగా ఉందన్నారు.
అమ్మ ఒడి పథకంలో భాగంగా గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా 300 ఆంబులెన్స్ లు ఏర్పాటుచేసిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. అమ్మ ఒడి పథకంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 10 లక్షల 85 వేల గర్భిణీలకు ప్రయోజనం కలిగిందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటివరకు 13 లక్షల 30 వేల మంది బాలింతలకు 2 వేల రూపాయల విలువైన కేసీఆర్‌ కిట్లు అందజేశామన్నారు. ప్రసవం తరువాత ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మహిళలు శారీరక శ్రమ చేయకూడదన్న ఉద్దేశ్యంతో ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు, మగబిడ్డ పుడితే 12 వేల రూపాయల పారితోషకం ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కిట్స్ తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు డెలివరీలు పెరిగాయన్నారు. మాతాశిశు మరణాల తగ్గింపులో దేశం మొత్తంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకుందన్నారు. సిజేరియన్ లను తగ్గించాలన్న లక్ష్యంతో సహజ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి 3వేల రూపాయల అదనపు ప్రోత్సాహకం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తమ ఆడపడుచుల ఆరోగ్యం, సంక్షేమం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

 

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి తమ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకం లో భాగంగా లక్షా నూట పదహారు రూపాయలను కట్నంగా ఇస్తుందన్నారు కేటీఆర్. తల్లిదండ్రులకు అమ్మాయి పెళ్లి భారం కావద్దని ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకం తో 12 లక్షల 87 వేల 588 మంది వధువులకు నగదు సాయం అందించామన్నారు.

ఆరోగ్య లక్ష్మి కింద సుమారు 5 లక్షల (5, 18,215) శిశువులకు, 21లక్షల (21, 58,479) గర్భిణీ స్త్రీలకు, 18 లక్షల (18, 96,844) పాలిచ్చే తల్లులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 4 లక్షల స్వయం సహాయక బృందాలకు తమ ప్రభుత్వం నిరంతరం మద్దతు అందిస్తోందన్న కేటీఆర్, అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల్లో కేంద్రం తన కోటా తగ్గించుకున్నా కూడా అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల జీతాలను తాము పెంచామని తెలిపారు.

కంటివెలుగు తో రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలను ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద ములుగు, సిరిసిల్ల జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ సిద్దం చేస్తామన్నారు.

మిషన్‌ భగీరథతో ఆడబిడ్డల నీటి కష్టాలను పూర్తిగా తొలగించామన్న కేటీఆర్, ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెంచామన్నారు. 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలను ఏర్పాటుచేసి పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. పిల్లలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ముందుగా తల్లులే తల్లడిల్లుతారని, అందుకే పిల్లల వైద్యం విషయంలో మాతృమూర్తులు ఎలాంటి ఆందోళన చెందకూడదన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

4లక్షల 30 వేల పైచిలుకు ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను ఇచ్చి ఆర్థికంగా భరోసా నిలిచామని కేటీఆర్ చెప్పారు. మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆడబిడ్డల తాగునీటి కష్టాన్నీ మిషన్ భగీరథతో పూర్తిగా తీర్చామన్న కేటీఆర్, మన స్పూర్తితోనే దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ ను కేంద్రం ప్రారంభించిందని గుర్తుచేశారు.

మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే ఉద్దేశ్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా వీ హబ్ ని ఏర్పాటుచేశామన్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల, డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేసి ఆడపిల్ల విద్య భారంగా మారకుండా చూస్తున్నామన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. చట్టసభల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లును తేవాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను స్త్రీలకే కేటాయించడంతో పాటు మహిళల పేరుతోనే ఇండ్ల పట్టాలను ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

సుసంపన్నమైన సమాజ నిర్మాణ రూపకర్తలు స్త్రీలే అని తమ ప్రభుత్వం భావిస్తోందన్న కేటీఆర్, అన్ని రంగాల్లో మహిళలకు సరైన అవకాశాలు దక్కేలా, వారి ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒక్క ఆడబిడ్డ బాగుంటే మొత్తం కుటుంబం, మొత్తం సమాజం మంచిగుంటదన్న లక్ష్యంతోనే మహిళా సంక్షేమాన్ని కర్తవ్యంగా భావించి పనిచేస్తున్నామన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్న పలువురు లబ్ధిదారులు మంత్రి కేటీఆర్ తో సంభాషించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తమకు కలిగిన భరోసాను వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. రాఖీ పండుగకు పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ తమతో ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం తమకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వ పథకాల వలన తమకు కలిగిన లబ్ధి మరియు వాటి ప్రయోజనాలను వివరిస్తూ పలువురు మహిళలు ఉద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, కేసిఆర్ కిట్ పథకాలు తమ జీవితాల్లో అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల వలన అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద వర్గాలకు చెందిన తమకు కష్టాలు రాకుండా అండగా నిలబడ్డాయని తెలిపారు

 

 

Other News

Comments are closed.