మినీ ఎయిర్‌పోర్ట్‌పై మళ్లీ కదలిక

share on facebook

భూములకు ధరలు వస్తాయన్న ఆశలో రైతులు
మహబూబ్‌నగర్‌,జూలై30 (జనం సాక్షి) :  జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎయిర్‌పోర్టు ఆశలకు మరోసారి ప్రయత్నాలు మొదలయ్యాయి. భూమలు సర్వేతో మళ్లీ అధికారులు రానున్నట్లు సమాచారంతో ఇక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ బూములకు రేట్లు పలుకుతాయన్న ధోరణిలో ఉన్నారు. రెండేళ్లక్రితం గుడిబండ వద్ద మినీ విమానాశ్రయం ఏర్పాటుకు ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖల అధికారులు స్థలాన్ని పరిశీలించారు. అయితే విమానయాన శాఖ అధికారులు కూడా వస్తారని ప్రచారం జరిగినా వారు రాలేదు. దీంతో విమానాశ్రయం ఆశలపై అప్పట్లో నీళ్లు చల్లినట్లయింది. తాజాగా మరోసారి విమానాశ్రయం ఏర్పాటుకుస్థలాన్ని పరిశీలించేందుకు అధికారులు రానున్నట్లు రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో మళ్లీ ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. అడ్డాకుల మండలంలో మినీ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని రెండేళ్ల కిందట సీఎం కేసీఆర్‌  ప్రకటన చేశారు. ఆ వెంటనే రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖ అధికారులు అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. గుడిబండ గ్రామం పక్కనే ఉన్న సర్వే నంబర్‌ 118లో ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పలుమార్లు పరిశీలిచారు. ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా పరిశీలించి వెళ్లారు. ఆ తర్వాత మూసాపేట మండలంలోని తుంకినీపూర్‌, దాసర్‌పల్లి, వేముల, భూత్పూర్‌ మండలంలోని రావులపల్లి గ్రామాల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పరిశీలన చేశారు. మూడు మండలాల్లో తిరిగిన రెవెన్యూ అధికారులు భూముల వివరాలు, మ్యాపులను ఉన్నతాధికారులకు పంపించారు. ఇక అంతటితోనే విమానాశ్రయం ఏర్పాటుకు స్థలాల పరిశీలన చేయడం ముగిసింది. అయితే అప్పట్లోనే రాష్ట్రంలో వేర్వేరు చోట్ల మూడు మినీ విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో పాలమూరుకు విమానాశ్రయం మంజూరు కాలేదు. గుడిబండ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలపై ఇటీవల వైమానిక శాఖ అధికారులు రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆరా తీశారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలం, దాని చుట్టూ ఉన్న ప్రైవేటు భూముల వివరాలను సేకరించడంతో పాటు అధికారులు ఇటీవల స్థలాన్ని పరిశీలించారు. వైమానిక శాఖ అధికారులు కూడా ఇక్కడి స్థలాన్ని పరిశీలించడానికి త్వరలో రానుండటంతో మళ్లీ విమానాశ్రయ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. విమానాశ్రయం కోసం దాదాపు 500ఎకరాలు భూమి అవసరమైన నేపథ్యంలో సర్వే నంబర్‌ 118లో 70ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే ఆ భూమిని కొందరు రైతులకు ప్రభుత్వం కేటాయించినా ఇప్పటి అవసరం దృష్ట్యా దాన్ని తిరిగి తీసుకునే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టుకు ఈ స్థలం అనుకూలంగా ఉన్నట్లు అధికారులు భావిస్తే చుట్టుపక్కల రైతుల ప్రైవేట్‌ భూములను సేకరించే అవకాశం ఉంటుంది. వైమానిక అధికారులు గుడిబండ వద్ద విమానాశ్రయ ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తామని చెప్పారు.

Other News

Comments are closed.