రాజధాని ప్రాంతాన్ని కదిలిస్తే ఉద్యమిస్తాం

share on facebook

రైతులకు ఇస్తున్న పెన్షన్‌ 9వేలకు పెంచాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్‌
గుంటూరు,ఆగస్ట్‌24 (జనంసాక్షి): రాజధానిని కదిలిస్తే సహించేది లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. ఇంతకాలం వ్యవసాయాన్ని వదులుకుని రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గతేం కావాలన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను గందరగోళంలోకి పడేస్తుందన్నారు. రాజధానిపై సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధాని తరలింపు అనే ఆలోచనే రాకూడదని.. వస్తే ఉద్యమం తప్పదన్నారు. ఆ ఆలోచన తక్షణమే విరమించు కోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అరెస్టులు, బెదిరింపులకు
సీపీఐ భయపడదన్నారు. రాజధాని గ్రామం తుళ్లూరులో పార్టీ నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. పెదకూరపాడు, తాడికొండ మంగళగిరి నియోజకవర్గాల సీపీఐ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు, విజయవాడ నడుమ రాజధానిని ఏర్పాటుకు మొదటిసారిగా స్వాగతించింది సీపీఐ అని పేర్కొన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాజధానిలో పేదలకు ఇస్తున్న రూ.2500 పింఛన్‌ను రూ.9 వేలకు పెంచాలని డిమాండు చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ జాప్యం చేస్తే భూ ఆక్రమణలకు దిగుతామని హెచ్చరించారు. ఇసుక, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై నాయకులు స్పందించారు. మంత్రుల ప్రకటనలపై సిఎం వైఎస్‌ జగన్‌ స్పష్టత ఇవ్వాలన్నారు.

Other News

Comments are closed.