రైతుబంధు సమీక్ష సమంజసం సమంజసం

share on facebook

‘జనంసాక్షి’ ప్రత్యేక | కథనం..

పేద రైతులకే సహాయం చేయాలి •గరిష్ట భూపరిమితి పదెకరాలు ఉండాలి

• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించాలి

• ముప్పై శాతం ఆదాయం పన్ను కట్టేవారినీ మినహాయించాలి

• పట్టణ శివార్లలో ప్లాట్లుగా మార్చిన వ్యవసాయ భూములను మినహాయించాలి

• కౌలురైతులకు కూడా లబ్ది చేకూర్చే చర్యలు తీసుకోవాలి

• సవరణలు చేసినా పీఎం కిసాన్ సమ్మాన్ •నిధి కంటే మెరుగే

• వ్యవసాయ ఋణమాఫీకి కూడా గరిష్ట భూపరిమితి పెట్టాలి

• పరిమితులు లేకపోవడంతో ప్రభుత్వం మీద వెల్లువెత్తుతున్న విమర్శలు

హైదరాబాద్, సెప్టెంబర్ 12,(జనంసాక్షి): (నర్మాలపరందాములు)

వ్యవసాయ పెట్టుబడుల కోసం తెలంగాణ రైతులు తిప్పలు పడొద్దనే లక్ష్యంతో రూపకల్పన చేసిన ‘రైతుబంధు’ పథకాన్ని 2018 మే నెల పదో తారీఖున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించిన విషయం తెలిసిందే. పైరవీలకు ఆస్కారం ఉండొద్దని భావించి ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ రైతుకు పెట్టుబడి సహాయం క్రింద సీజనుకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున అందించేలా రైతుబంధు పథకాన్ని రూపొందించారు. సరళమైన నిబంధనలతో రూపొందించిన రైతుబంధు పథకం ద్వారా గత సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఏడాదికి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలను నేరుగా రైతు కోరుకున్న ఖాతాలో వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ పెట్టుబడి సహాయాన్ని ఏడాదికి ఎనిమిది వేల నుండి పది వేల రూపాయలకు పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం ఖరీఫ్ కు సంబందించిన రైతుబంధు మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తుంది. నిధుల కొరతనో లేక పూర్తిస్థాయి బడ్జెట్ ఆమోదం కానందుననో ఖరీఫ్ కు అందాల్సిన రైతుబంధు మొత్తం రైతులందరికి నేటికీ అందలేదు. వ్యవసాయం భారం కాకూడదనే లక్ష్యంతో కొనసాగుతున్న రైతుబంధు పథకం ద్వారా సుమారు యాభై ఏడు లక్షల రైతులు లబ్ది పొందుతున్నారు. రైతుబంధు పథకం పట్ల లబ్దిదారులు పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నప్పటికీ ఏడాదికి పన్నెండు వేల కోట్ల రూపాయల బడ్జెటు కేటాయించి కొనసాగిస్తున్న భారీ పథకం కావడంతో క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నది. వ్యవసాయ భూమిగా కోటి నలభై లక్షల ఎకరాలు నమోదై ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖ నివేదికలను గమనిస్తే గత మూడు సీజన్లలో ఒక్కసారి కూడా సాగుభూమి కోటి ఎకరాలకు మించలేదు. అంటే ఇరవై తొమ్మిది శాతం రైతుబంధు నిధులు వ్యవసాయ పెట్టుబడికి ఉపయోగించడం లేదని స్పష్టం అవుతుంది. ఇలా సాగు కాని భూములకు రైతుబంధు వర్తింపచేయడంతో ప్రభుత్వానికి ఆర్ధిక భారమే కాకుండా విమర్శలకు కూడా తావిచ్చినట్లైతుంది. మరోవైపు ఈ పథకంలో గరిష్ట భూపరిమితి లేకపోవడంతో దాదాపు పదకొండు శాతం నిధులను తలా పదెకరాలకు పైగా ఉన్న రెండు శాతం రైతులు మాత్రమే పొందుతున్నారు. పదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు రైతుబంధు వర్తింపచేయడాన్ని కూడా చిన్న, సన్నకారు రైతులతో పట్టు సాధారణ ప్రజలు ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రైతుబంధు పథకాన్ని వర్తింపచేయడాన్ని కూడా పునఃసమీక్షించాలి. ఏడాదికి పది లక్షలకు పైగా ఆదాయం ఉన్నవాళ్ళే తమ ఆదాయంలో ముప్పై శాతం ఆదాయ పన్నుగా కడతారు కాబట్టి వాళ్ళకు వ్యవసాయ పెట్టుబడి సహాయం సమంజసం కాదు. పైగా ఈ వర్గాలలో ఎక్కువ శాతం కౌలుకు మాత్రమే ఇచ్చేవారు ఉంటారు. ఈ సందర్భంలో కౌలు రైతులకు కూడా సహకరించేందుకు అఖిలపక్ష కమిటీ ద్వారాగాని, నిపుణుల కమిటీ ద్వారాగాని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఆర్థికమాంద్యం ప్రభావం వలన ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఆడంబరాలకు దూరంగా ఉండాలనుకుంటున్న ప్రభుత్వం పంథానికి పోకుండా రైతుబంధు పథకాన్ని సమీక్షించి, ప్రజలకు ఆమోదయోగ్యమైన నిబంధనలను రూపొందించి ప్రజాధనం అరులైన లబ్దిదారులకే చెందేలా చర్యలు తీసుకోవాలి.

Other News

Comments are closed.