వందరోజుల్లో ఆకాశమంత విజయం  

share on facebook

ఆర్థిక మందగమనం ఎలా ఉన్నా దేశంలో సమర్థమైన పాలన సాగేలా మోడీ తీసుకుంటున్నచర్యలు దేశంలోనే గాకుండా, ప్రపంచంలోనూ ప్రశంసలు వస్తున్నాయి. అగ్రరాజ్యాలు అమెరికా,రష్యాలతో స్నేహం చెడకుండా వాటితో బంధాన్నికొనసాగిస్తున్న తీరు మోడీ చాతుర్యానికి నిదర్శనంగా చూడాలి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత ఈ వందరోజుల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం మోడీ ప్రభుత్వానికే సాధ్యమయ్యింది. ప్రజల కోసం పని చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వంగా మోడీ నిరూపించు కున్నారు. వంద రోజుల పాలనలో మోదీ సారథ్యంలోని రెండో ప్రభుత్వం ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన విజయాలను సాధించింది. అన్నింటికి మించి 370 ఆర్టికల్‌ రద్దు చేయడం, పాక్‌ను ఏకాకి చేయడం అన్నది ప్రపంచ చరిత్రలో అద్భుతమైన విజయంగా చూడాలి. అది బిజెపి మాత్రమేచేయగలదని నిరూపించారు. ఇదే క్రమంలో అవినీతి నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. చిదంబరం, డికె శివకుమార్‌ల అరెస్ట్‌ వ్యవహారాలు చూస్తుంటే అవినీతి నేతలను బొక్కలో తోయడానికి మోడీ వెనకాడడని నిరూపించారు. ఇలా రాజకీయాలను అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని దోచుకున్న దగుల్బాజీలను బొక్కలో తోస్తే ప్రజలు జేజేలు పలుకుతారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తన తొలి వందరోజుల పాలనలో పలు కీలక నిర్ణయాలను  తీసుకోవడమే గాకుండా వాటిని అమలు చేసి చూపారు. ఆయన వందోరోజున సరిగ్గా చంద్రాయాన్‌ సక్సెస్‌ కావడం ఆకాశమంత విజయంగా చూడాలి. ఇకపోతే ముస్లిం మహిళలకు రక్షణగా ట్రిపుల్‌ తలాక్‌ రద్దుకూడా అతిపెద్ద విజయంగానే చూడాలి. భారతదేశంలోని ముస్లిం మహిళలకు సామాజిక ప్రతిష్ఠను, గౌరవ మర్యాదలను అందించేందుకై మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ చట్టం నిదర్శనంగా చూడాలి. ఎన్డీయేతర పార్టీలు కూడా తక్షణ తలాక్‌ బిల్లుకు మద్దతు ఇవ్వడం మోడీ విజయంగా చూడాలి. ఈ విజయాలను చూస్తున్న ప్రజలు ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి కావాలని కోరుకుంటున్నారు. అలాగే రాజకీయా సంస్కరణలు కూడా కోరుకుంటున్నారు. దేశంలో అవినీతి రహిత రాజకీయాలను ప్రజలు కోరుకుంటున్నారు. ఈ దిశగా మోడీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తే ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ రెండో ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలతో పురోగమించాలని కోరుకుంటు న్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం. ఏడు దశాబ్దాలుగా అపరిష్కృతంగావున్న కశ్మీర్‌ సమస్యను ప్రధాని మోదీ ప్రభుత్వం 70 రోజుల్లో అనితరసాధ్యంగా పరిష్కరించింది. ఆర్టికల్‌ 370 రద్దుతో భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌, దివంగత ప్రధాని వాజపేయి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ల స్వప్నం సాకారమైంది. పార్లమెంట్‌ చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజుగా 2019 ఆగస్టు 5 చరిత్రలో  నిలిచిపోతుంది. పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమవుతాయనడంలో సందేహం లేదు.  మోదీ సర్కార్‌ తీసుకున్న సాహసోపేతమైన ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం తరవాత  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వదేశంలోనే కాక విదేశాల్లో సైతం బ్రహ్మరథం పడుతు న్నారు. ముఖ్యంగా ముస్లిం దేశాల్లో ఆయనకు ఎర్ర తివాచి పరుస్తు న్నారు. బహ్రెయిన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారా లను మోదీకి ప్రదానం చేశాయి. దీంతో కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌ అంతర్జాతీయ సమాజంలో పూర్తిగా ఏకాకి అయ్యింది. ఇది మోదీ రాజనీతిజ్ఞతకు ఒక తిరుగులేని నిదర్శనంగా చూడాలి. ఇకపోతే  దేశరక్షణ వ్యవస్థలో ఒక అతి పెద్ద సంస్కరణకు మోదీ సర్కార్‌ పూనుకున్నది. ఆగస్టు 15న ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి
ప్రసంగిస్తూ త్రివిధ సాయుధ బలగాలను సమన్వయ పరచడానికి వాటికి ఉమ్మడిగా ఒక మహాదళాధిపతి  నియమించనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసేందుకు మోదీ సర్కార్‌ సంకల్పించింది. ఇంతవరకు దాదాపు 250 చట్టాలను రద్దు చేసింది. ఇదే సమయంలో శ్రమ జీవులకు మేలు చేసే కార్మిక చట్టాలపై దృష్టి సారించి నాలుగు చట్టాల స్థానంలో ఒకే చట్టంగా ‘వేతనాల కోడ్‌ -2019’ ను రూపొందించింది. భారతదేశ అంతరిక్ష ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-2 ప్రాజెక్ట్‌ విజయవంత మవడం మనకు గర్వకారణం. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడిపై పరిశోధ నలు చేశాయి. చంద్రయాన్‌-2తో ఆ దేశాల సరసన భారత్‌ కూడా చేరింది.  సంస్కరణల్లో వేగం, ప్రతి ఒక్కరికీ సంక్షేమం, సామాజిక న్యాయం వంటి విషయాల్లో మోదీ సర్కార్‌ మొదటి విడత పాలనలో కంటే ఈ వంద రోజుల్లోనే విశేష స్థాయిలో సత్ఫలితాలు సమకూరాయి. ఫలితంగా ప్రధాని మోదీ నాయకత్వ పటిమ, పాలనా దక్షతపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. దీర్ఘకాల ప్రయోజనాలపైనే మోదీ సర్కార్‌ దృష్టిని కేంద్రీకరించింది. ఈ క్రమంలో దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఇంకా యుద్దంచేయాల్సి ఉంది. అవినీతి రహిత పాలనతో పాటు రాజకీయ అవినీతిని పారద్రోలాలి. రాజకయీఆల్లో వారసత్వాన్ని రూపుమాపాలి. ఒకేదేశం, ఒకే చట్టం అన్ననినాదాం రావాలి. జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ సాకారం చేసే దిశగా అడుగులు వేస్తే మోడీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాగా భారత్‌ బలమైన దేశంగా ఎదుగుతుంది.

Other News

Comments are closed.