దొంగ ఓట్లకు పోలీసుల రక్షణ

 

 

 

 

 

 

 

 

నవంబర్ 12(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్‌ పార్టీ బరితెగించింది. ‘నమస్తే తెలంగాణ’ హెచ్చరించినట్టే జరిగింది. 20 వేల దొంగ ఓటర్లు, 20 వేల నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి గెలుపు కోసం బరితెగించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓట్‌ చోరీకి బరి తెగించింది. కీలక మంత్రి కనుసన్నల్లో 20 వేల మంది దొంగ ఓటర్లు జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ బూత్‌లను క్యాప్చర్‌ చేశారు. రౌడీషీటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముందు నడిచి దొంగ ఓటర్లను పోలింగ్‌ బూత్‌ వరకు చేర్చగా, పోలీసుల రక్షణ వలయంలో పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి యథేచ్ఛగా ఓట్లు గుద్దుకున్నారు.

కార్వాన్‌, రాజేంద్రనగర్‌, ఖైరతాబాద్‌, బీదర్‌, గుల్బర్గా ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లు నిర్భీతిగా కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి వెళ్లిపోయారు. 25 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పోలింగ్‌ బూత్‌లకు 100 మీటర్ల దూరంలోనే తిష్ట వేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి టేబుల్‌పై నుంచి ఓటర్‌ స్లిప్పులు, టేబుల్‌ కింద నుంచి చీరలు పంపిణీ చేశారు. ఫోన్‌ నంబర్‌ అడిగి అక్కడికక్కడే ప్రతి ఓటరుకు రూ 5,000 చొప్పున ఫోన్‌ పే చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఓటరును ప్రలోభపెట్టారు. ప్రతిఘటించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల వీపుల మీద పోలీసుల లాఠీలు నాట్యమాడాయి. చేతికి అందిన కార్యకర్తను బెదరగొట్టి దొంగలకు రూట్‌ క్లియర్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని కూడా పోలీసులు భయపెట్టారు. ఆమె చుట్ట్టూ ఊహించనంతమంది షాడోలను పెట్టి కదలికలను కట్టడి చేశారు. డ్రోన్‌ కెమెరాలతో అంతా చూస్తున్నామని ఢాంబికాలు పలికిన ఎన్నికల కమిషన్‌ కండ్లు మూసుకొని కాంగ్రెస్‌ సేవలో తరించింది. బీజేపీ డైరెక్షన్‌లో కాంగ్రెస్‌ నేతల ఆగడాలను అధికారికంగా అనుమతించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది.

షేక్‌పేటలో కౌసర్‌ దౌర్జన్యం

కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌, ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌, స్థానిక కార్పొరేటర్‌ కలిసి షేక్‌పేట డివిజన్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు పూర్తిగా వారి అదుపు ఆజ్ఞల్లోకి వెళ్లిపోయారు. ఎలాంటి ఎంట్రీ పాస్‌ లేకున్నా వారు నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటర్లను, ఏజెంట్లను, అధికారులను బెదిరించారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి బీఆర్‌ఎస్‌ పార్టీ బూత్‌ ఏజెంట్లను బయటికి లాగిపారేశారు. కౌసర్‌ మొహియుద్దీన్‌ హకీంషావలి కాలనీలో వంద ఆటోలతో అడ్డా పెట్టుకున్నారు. బీదర్‌, కార్వాన్‌ నుంచి తీసుకొచ్చిన దొంగ ఓటర్లను ఆటోలలో పంపించారు. ప్రతి ఆటో ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహించిన పోలీసు అధికారుల కనుసన్నల్లోనే పోలింగ్‌ బూత్‌ వరకు వెళ్లినట్టు స్థానికులు చెప్తున్నారు. వేలకొద్దీ మహిళా నకిలీ ఓటర్లు షేక్‌పేటలో ఓట్లు వేసినట్టు స్థానికులు చెప్తున్నారు. బూత్‌ నంబర్లు 66,67లో ప్రిసైడింగ్‌ అధికారులను బెదిరించి, బీఆర్‌ఎస్‌ పార్టీ ఏజెంట్‌ని బలవంతంగా బయటకు పంపారు. ఐడీ కార్డులు లేకుండానే ఓట్లు వేయించారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కి పాల్పడినట్టు చెప్తున్నారు. మొహియుద్దీన్‌ ఆగడాలను బీఆర్‌ఎస్వీ నేతలు ప్రతిఘటించే ప్రయత్నం చేయగా, పోలీసులు, రౌడీ షీటర్లు కలిసి వారిపై దాడి చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. వీడియోలు తీస్తున్నవాళ్ల ఫోన్లు కూడా లాకున్నారని స్థానికులు చెప్పారు. షేక్‌పేట డివిజన్‌ సమతా కాలనీ అపెక్స్‌ స్కూల్‌లోని 4,5,6,7 పోలింగ్‌ బూత్‌లలోకి ఎంఐఎం కార్యకర్తలు జొరబడి ఓటర్లను బెదిరించినా పోలీసుల చోద్యం చూశారే తప్ప ఎంఐఎం పార్టీ ఆగడాలను నిలవరించలేక పోయారని స్థానిక ఓటర్లు చెప్పారు. 4వ బూత్‌లోకి తాను ఓటు వేసే సమయానికి ఎంఐఎం వ్యక్తులు వచ్చి తనను పక్కకు జరిపి చెయ్యి గుర్తుకు ఓటేశారని సమతా కాలనీకి చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

రౌడీషీటర్లతో పోలీసులు మిలాఖత్‌

బోరబండలో కార్పొరేటర్‌ ఫసియుద్దీన్‌ రౌడీషీటర్లతో రెచ్చిపోయారు. తనకు అడ్డూ అదుపే లేదన్నట్టుగా దొంగ ఓటర్లను పోలింగ్‌ బూత్‌లలోకి చొప్పించి ఓట్లు వేయించారు. పోలింగ్‌ బూత్‌ వద్దనే కుర్చీ వేసుకొని ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మీద భౌతిక దాడికి దిగారు. ఆయనకు అండగా నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ తదితర కాంగ్రెస్‌ నేతలు పోలింగ్‌ బూత్‌లలో తిరుగుతూ దొంగ ఓటర్లకు ధైర్యాన్ని నూరిపోశారు. స్థానిక ప్రజలు వీరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదు. కొన్ని పోలింగ్‌ కేంద్రాలలో పోలీసులు భద్రతా వ్యవహారాన్ని గాలికి వదిలేసి ప్రశాంతంగా కునుకు తీయడం కనిపించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ సిద్ధార్థనగర్‌ బూత్‌ 120 వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పర్యటించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌ సిద్ధార్థ్‌నగర్‌ బూత్‌ నంబర్‌ 121లో వైరా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ హల్‌చల్‌ చేశారు. ఎమ్మెల్యేను వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులతో ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. మీకు ఇకడ ఏం పని అని ప్రశ్నించడంతో ఆయన అకడి నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రహమత్‌నగర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన టేబుల్‌ వద్ద కూర్చోవడం గమనార్హం. ఎర్రగడ్డ డివిజన్‌లో ఓ వ్యక్తి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే పెన్షన్‌ ఆపేస్తామని తన తల్లిని బెదిరించి ఓటు వేయించుకున్నారని ఆరోపించిన వీడియో వైరల్‌ గా మారింది.

బైండోవర్‌ రౌడీ షీటర్‌కు పోలీసు రక్షణ వలయం

కరుడుగట్టిన నేరస్థుడు, పలు హత్యకేసుల్లో నిందితుడు, రౌడీషీటర్‌ చిన్న శ్రీశైలంయాదవ్‌ను జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల దృష్ట్యా ఇటీవల బైండోవర్‌ చేశారు. ఆయన పోలింగ్‌ బూత్‌ల వద్ద సంచరించడం నిషేధం. అటువంటి వ్యక్తి రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జరుగుతున్న ఎన్నికల్లో నిర్భయంగా పోలింగ్‌ కేంద్రాల్లో తిరుగుతూ ఓటర్ల మీద దాడులు చేస్తుంటే ఎన్నికల కమిషన్‌, పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూసింది.

పోలీసు వ్యవస్థ రౌడీ షీటర్‌కే వత్తాసు పలుకుతూ రక్షణ కవచంగా నిలబడింది. తన చిన్న కొడుకు వెంకట్‌యాదవ్‌తో పాటూ రౌడీషీటర్లను వెంటేసుకొని వచ్చి బీఆర్‌ఎస్‌ స్థానిక నేతల మీద దాడులకు దిగారు. యూసుఫ్‌గూడలోని మహమ్మద్‌ ఫంక్షన్‌ హాల్‌కు పెద్దఎత్తున మహిళా దొంగ ఓటర్లను రప్పించిన చిన్న శ్రీశైలంయాదవ్‌ వారి చేత దొంగ ఓట్లు వేయిస్తుండగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన చిన్న శ్రీశైలంయాదవ్‌ కార్యకర్తల మీద చేయి చేసుకున్నారు. అదే సమయంలో పోలీసులు ఆయనకు తోడు వచ్చి కార్యకర్తలను తరిమికొట్టారు. వాస్తవానికి ఆయన పోలీసు అదుపు ఆజ్ఞల్లో ఉండాల్సిన రౌడీషీటర్‌. బైండోవర్‌ చేసిన రౌడీషీటర్‌ పోలింగ్‌ బూత్‌ వద్దకు రావడం చట్ట విరుద్ధం. పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకొని కోర్టుకు తరలించాల్సింది పోయి, ఆయనకు సెక్యూరిటీగా మారడంపై ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.