వణికిస్తున్న చలి

నవంబర్ 13 జనం సాక్షిహైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Wave) రోజురోజుకు పెరిగిపోతున్నది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలిలో ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠంగా 7.1 డిగ్రీలుగా నమోదయింది. ఇక తిర్యాణిలో 8.2 డిగ్రీలు నమోదయింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ చలి తీవ్రత తగ్గకపోవడంతో స్కూళ్లు, కార్యాలయాలు, రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు.
ఇక హైదరాబాద్‌లో అతితక్కువగా హెచ్‌సీయూలో 11.8 డిగ్రీలు రికార్డయింది. రాజేంద్రనగర్‌లో 12.9, మారేడుపల్లిలో 13.6 డిగ్రీల రికార్డయింది. ఉదయం 6 గంటల సమయంలో నగర శివార్లలోని ఇబ్రహీంపట్నలో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, మరో నాలుగు ఐదు రోజుల్లో చలి తీవ్రత మరింత పరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
చలి పట్ల అప్రమత్తంగా ఉండాలి: వైద్యారోగ్యశాఖ
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. ఈ మేరకు డీహెచ్ రవీందర్‌నాయక్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉండటంతో అలర్ట్‌గా ఉండాలని సూచించారు. జ్వరం, దగ్గు, గొంతు తడి ఆరిపోవడం, నొప్పులు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. గర్భిణులు, ఐదేండ్లలోపు చిన్నారులు, వృద్ధుల్లో సీజనల్ ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని దవాఖానలను సందర్శించాలని కోరారు. అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే తక్షణమే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు.



