పార్కు స్థలం కబ్జాకు స్కెచ్‌

 

 

 

 

  • నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి చదును చేసేందుకు యత్నం
  • స్థానికుడి ఫిర్యాదు మేరకు స్థలాన్ని పరిశీలించి
  • బోర్డులు ఏర్పాటుచేసిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

బడంగ్‌పేట్‌, నవంబర్‌ 12: ప్రభుత్వ, పార్కు స్థలాల కబ్జాపై చట్టపరమైన చర్యలు తప్పవని టౌన్‌ ప్లానింగ్‌ అధికారి కిరణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆర్‌ఎంఆర్‌ కాలనీలో ఉన్న పార్కు స్థలం కబ్జాకు గురవుతున్నదని.. సంబంధిత స్థలాన్ని కాపాడాలని మున్సిపల్‌ అధికారులకు ఇటీవల స్థానికుడు ధన్‌రాజ్‌ ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు బుధవారం పార్కు స్థలాన్ని పరిశీలించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి కిరణ్‌కుమార్‌.. సంబంధిత స్థలంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయించారు.

సుమారు రూ.1.93 కోట్లు విలువ చేసే 387 గజాల పార్కు స్థలాన్ని కాజేసేందుకు కొందరు బిగ్‌ స్కెచ్‌ వేశారు. నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి.. పార్కు స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు చదును చేసినట్లు అధికారులకు సమాచారం అందడంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి.. పరిశీలన అనంతరం అందులో ప్రభుత్వ స్థలంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడి పార్కు స్థలం చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.