సంక్షేమ పథకాల అమల్లో..  దేశానికి తెలంగాణ ఆదర్శం

share on facebook


– 16స్థానాల్లో గెలిచి కేంద్రంలో కీలకంగా మారబోతున్నాం
– రాష్ట్ర సమస్యలు పరిష్కారం తెరాస అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యం
–  నిజాంసాగర్‌ చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం
– రూ. 67కోట్లతో కెనాల్‌లకు మరమ్మతులు చేయిస్తున్నాం
– అర్హులైన ప్రతీఒక్కరికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం
– నిజామాబాద్‌ తెరాస ఎంపీ అభ్యర్థి కవిత
నిజామాబాద్‌, మార్చి26(జ‌నంసాక్షి) : సంక్షేమ పథకాల అమల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెంజిల్‌ మండలం శాటాపూర్‌లో ఎంపీ కవిత నేడు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో దేశం తెలంగాణవైపు చూసేలా కేసీఆర్‌ పాలన సాగించారని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్‌ అమలు చేసిన పథకాలను ఇతర రాష్ట్రాల్లో అక్కడి ముఖ్యమంత్రులు అమలు చేసుకుంటున్నారని.. ఇదే కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్‌లో తమ శాయశక్తులా పోరాటం చేశామని, కేంద్ర మంత్రులను కలిసిశామని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్లక్ష్యం వహించిందని కవిత ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్ర సమస్యలుపరిష్కరించుకోవాలంటే.. 16స్థానాల్లో తెరాస అభ్యర్థుల గెలపు ఖాయం కావాలని అన్నారు. 16స్థానాలతో పాటు దేశంలోని ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో కేసీఆర్‌ కీలకంగా మారుతారని అన్నారు.  గత ఐదేళ్లలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. రెంజల్‌ మండలంలో వెయ్యి కుటుంబాలకు కల్యాణలక్ష్మి ద్వారా లబ్ది జరిగిందని తెలిపారు. సర్కార్‌ దవాఖాలను ప్రజలకు వరంలాగా మార్చింది సీఎం కేసీఆరేనని కొనియాడారు. ప్రజల అవసరం, ఆర్తి తెలిసిన నాయకుడు కేసీఆర్‌ అన్నారు. నిజాంసాగర్‌ చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు రూ. 67 కోట్లతో కెనాల్‌లకు మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. స్వంత స్థలం ఉన్నవారికి రూ. 5 లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నరని చెప్పారు. ఎంపీలుగా రాష్ట్ర హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించినట్లు ఆమె పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలను గెలిపిస్తే ఢిల్లీలో మన సమస్యల విూద పోరాడుతామన్నారు. ఈ రోడ్‌షో కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్‌, రాష్ట్ర నాయకులు మోహన్‌రెడ్డి, కార్యదర్శి విఠల్‌రావు పాల్గొన్నారు. రెంజల్‌ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే షకీల్‌ పిలుపునిచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం కవిత ఎంతో కృషి చేశారన్నారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి మద్దతు సాధించినట్లు తెలిపారు.

Other News

Comments are closed.