అంగారకుడిపై దిగిన క్యూరియాసిటి రోవర్‌

వాషింగ్టస్‌: అంగారక గ్రహం పై జీవం ఆనవాళ్లను పసిగట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా ప్రయోగించిన ‘ క్యూరియాసిటీ’ రోవర్‌ సోమవారం నిర్దేశిత లక్ష్యంపై కాలు మోపింది. ఉదయం 11 గంటలకు ఇది ఆ గ్రహంపైనున్న గేల్‌ బిలంలో విజయవంతంగా దిగింది. క్యూరియాసిటీ దిగిన వెంటనే నాసా కేంద్రానికి సంకేతాలు రావడంతో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. సంతోషంతో ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అణు ఇంధనంతో పనిచేసే ఈ రోవర్‌ ఒక కారు పరిమాణంలో ఉంటుంది. జీవం ఉనికిని గుర్తించడానికి సంక్షిష్టమైన రసాయన కిట్‌ అందులో ఉంది. దాదాపు టన్ను బరువున్న ఈ రోవర్‌ అంగారకు  డిపైకి దిగడం సులువైన ప్రక్రియేమీ కాదు. గంటకు దాదాపు 20 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే వ్యోమనౌకను కేవలం ఏడు నిమిషాల్లోనే అరుణగ్రహంపైకి  సురక్షితంగా దిగింది.