అగ్రికెం ప్రకటన అభ్యంతరకరం

ప్రజలను మోసగించే చర్యలు : అఖిలపక్షం
శ్రీకాకుళం, జూలై 10 : విష వాయువులు, రసాయనిక వ్యర్థాలను విడుదల చేస్తూ భూగర్భ జలాలను, పీల్చే గాలిని కలుషితం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నాగార్జున అగ్రికెం యాజమాన్యం ప్రజలను తప్పుదోవపట్టించే ప్రకటనలు చేస్తోందని నాగార్జున అగ్రికెం వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు స్వామి శ్రీనివాసానంద అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో పోరాట కమిటీ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రికెం యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ నిర్వహిస్తుందన్నారు. పరిశ్రమను మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖతో పాటు కలెక్టర్‌కు సెక్షన్‌ 133ను జారీ చేశారన్నారు. దానిని విస్మరించి యాజమాన్యం పత్రికల్లో తప్పుడు ప్రకటనలు చేస్తుందని తెలిపారు. పరిశ్రమను పునర్‌ ప్రారంభించే చర్యల్లో భాగంగా ఇటువంటి ప్రకటనలు వస్తున్నాయని అన్నారు. వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు కె.అప్పలనాయుడు మాట్లాడుతూ పరిశ్రమలో భద్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో యాజమాన్యం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటనలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో యాజమాన్యం వైఫల్యం స్పష్టంగా తేటతెల్లమైన తర్వాత కూడా ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేయడం తగదన్నారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సుందర్‌లాల్‌ మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా యాజమాన్యం ఎటువంటి చర్యలు చేపట్టినా వాటిని ప్రతిఘటించి యాజమాన్యాన్ని తరిమికొటతామని చెప్పారు. సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి.ప్రకాశ్‌ మాట్లాడుతూ పూర్తిగా పరిశ్రమను మూసివేసి కార్మికులకు పూర్తి కాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎ.శ్రీనివాసరావు, కె.రాము, మురళీధర్‌బాబా, నీలంరాజు తదితరులు పాల్గొన్నారు.