అనుమతిచ్చి అరెస్టులు చేయడం బాధాకరం: ఎంపీలు
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం బాధాకరమని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. జేఏసీ అధికార ప్రతినిధి పిట్టల రవీందర్‌తో పాటు పలువురిని అరెస్టును ఎంపీలు ఖండించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణవాదులు స్వేచ్ఛగా హైదరాబాద్ తరలిరావొచ్చని పేర్కొన్నారు. ఎంపీలమంతా స్వయంగా మార్చ్‌లో పాల్గొంటామని స్పష్టం చేశారు. తెలంగాణ మార్చ్ ప్రజా ఉద్యమం అని తెలంగాణవాదులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కె. కేశవరావు పిలుపునిచ్చారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డుకోవద్దని పోలీసులను కోరారు. ఓయూలో అదనపు బలగాలను వెనక్కి రప్పించాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు. అరెస్టులతో ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొడుతోందని పేర్కొన్నారు. అరెస్టులను ఆపాలని హోంమంత్రిని కోరామని ఆయన చెప్పారు.
తెలంగాణ శక్తిని చూపించే తరుణమొచ్చిందని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. జిల్లాల నుంచి వస్తున్న వారిని అడ్డుకోవద్దని ఆయన పోలీసులకు సూచించారు. తెలంగాణవాదం లేదని చెప్పేందుకు కుట్ర జరుగుతోందని ఆయన తెలియజేశారు. మార్చ్‌కు అనుమతిచ్చి, అడ్డుంకులు సృష్టించడం సరైంది కాదన్నారు. తెలంగాణ మార్చ్ ఒక పవిత్ర యుద్దమని, శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎంపీ రాజయ్య తెలియజేశారు. స్వీయ నియంత్రణతో తెలంగాణవాదులు మార్చ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో వ్యవహరించి మార్చ్‌ను విజయవంతం చేయాలన్నారు.తెలంగాణవాదులంతా మార్చ్‌ను విజయవంతం చేయాలని ఎంపీ వివేక్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆకాంక్ష తెలిపే అవకాశం వచ్చిందని, సత్తా చాటాలని తెలియజేశారు. తెలంగాణ వ్యతిరేకులకు మార్చ్ ఒక గుణపాఠం కావాలని చెప్పారు. తెలంగాణ మార్చ్‌కు తరలివచ్చే ప్రజలకు పోలీసులు సహకరించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. సమైక్యవాదులకు చెంపపెట్టుగా మార్చ్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పరస్పర ఆరోపణలు చేసుకోవడం సరికాదన్నారు. అనుమతిచ్చిన తర్వాత పోలీసులు ఆటంకం కలిగించవద్దని ఆయన కోరారు. తెలంగాణ జర్నలిస్టులు కూడా మార్చ్‌లో పాల్గొనాలని తెలిపారు.