అన్నీ శుభ శకునాలే !

ప్రస్తుత కాలంలో తెలంగాణ విషయంలో అన్నీ శుభ శకునాలు ఎదురవుతున్నాయి. శుభవార్తలే వినిపిస్తున్నాయి. నడుస్తున్న పరిణామాలను చూస్తుంటే ఆ ‘కొత్త పొద్దు’ను చూసే రోజులు ఎంతో దూరంలో లేవనే నమ్మకం కలుగుతున్నది. నాలుగున్నర కోట్ల మంది ఆరున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తూ, కంటున్న ప్రత్యేక రాష్ట్ర కల త్వరలోనే సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజల కోరికలో నిజాయితీ ఉందని, వారి పోరాటం న్యాయబద్ధమని ఒక్కటొక్కటిగా పార్టీలు నమ్ముతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో కలిసి వస్తున్నాయి.  నిన్నా మొన్నటి వరకు ప్రధాన అడ్డంకిగా ఉండి, గతంలో వచ్చిన తెలంగాణను అడ్డుకున్న ప్రధాన రాజకీయ శక్తి తెలుగుదేశం పార్టీ. అలాంటిది ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా ఈ వారంలో తెలంగాణపై స్పష్టమైన లేఖను ఇస్తాననడం ఆహ్వానించదగ్గ పరిణామం. తెలంగాణ టీడీపీ నాయకులైతే తమ నాయకుడి నుంచి కచ్చితంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటనే వస్తుందని ఆశిస్తున్నారు. మొన్నటి వరకు ప్రత్యక్ష ఉద్యమానికి దూరంగా ఉంటూ, కేవలం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతునిచ్చిన సీపీఐ ప్రస్తుతం ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పోరుయాత్ర పేరిట తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొంది. అదే విధంగా ఎప్పటి నుంచో తెలంగాణకు తాము అనుకూలమని చెప్తూ, తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామన్న బీజేపీ కూడా ప్రస్తుతం తెలంగాణ కోసం ప్రత్యక్ష ఉద్యమంలోకి దిగింది. సోమవారం నుంచి ఆ పార్టీ కూడా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అధికార కాంగ్రెస్‌ పార్టీ వైఖరికి నిరసనగా దీక్ష చేపడుతున్నది. ఇక టీఆర్‌ఎస్‌ గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ పార్టీ తెలంగాణకు అడ్డుగా వచ్చే అవకాశాలను ఊహించుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే, టీఆర్‌ఎస్‌ ఆవిర్భావమే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమని ఆ పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. సీపీఎం విషయానికొస్తే ఆ పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము వ్యతిరేకమని చెప్తున్న ఆ పార్టీ నాయకులు, వాళ్ల వైఖరి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్న పెద్దగా జరిగే నష్టమేమీ లేదు. మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ఇస్తామని చెప్పి ఈ పార్టీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారాన్ని అనుభవిస్తున్నది. మేం తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, ఆ పార్టీ తమ వైఖరి చెప్పాలని, ఈ పార్టీ వైఖరి స్పష్టం చేయడం లేదని ఇంతకాలం కాంగ్రెస్‌ అధిష్టానం నాన్చుకుంటూ వచ్చింది. కానీ, ఇప్పుడు అలా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే, మెజార్టీ పార్టీలన్నీ తెలంగాణ ఏర్పాటుకు తాము అడ్డంకిగా లేమని, సుముఖంగానే ఉన్నామని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు, ఇంకా తెలంగాణ అంశాన్ని నాన్చుతూ, తమ పబ్బం గడుపుకునే అవకాశం లేదని కాంగ్రెస్‌ అధినాయకత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. ఒకవేళ ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ అంశాన్ని మళ్లీ పక్కన బెట్టాలని చూస్తే, వచ్చే ఎన్నికల్లో దాని పర్యవసానం ఎలా ఉంటుందో వాళ్లకు తెలుసు. ఇక జాప్యం చేయకుండా తెలంగాణ ఏర్పాటును ప్రకటించడం తప్ప యూపీఏకు వేరే దారి లేదు. ఇది గమనించే కాంగ్రెస్‌ వర్గాలు తెలంగాణవాదులకు సంకేతాలు ఇచ్చినట్లున్నారు. లేకుంటే, మొన్న కేసీఆర్‌, నేడు కోదండరాం ‘త్వరలో తెలంగాణ’ అనే ప్రకటన చేస్తారు ! ఇది ఆలోచించదగ్గ విషయం. అందుకే, ‘శుభ శకునాలు’ అన్న పదాన్ని వాడాల్సి వచ్చింది. కావచ్చు.. ఈ నెలలోనే కావచ్చు.. మనమంతా ఎదురుచూస్తున్న ప్రకటన ప్రభుత్వం రావచ్చు ! వస్తే గతంలో లాగా వెనక్కి వెళ్లకుండా.. అవసరమైతే పదవులనే కాదు.. ప్రాణాలను కూడా పణంగా పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చాల్సిన బాధ్యత ముమ్మాటికీ తెలంగాణ ఎంపీలపైనే ఉంది. లేకుంటే, తెలంగాణ ప్రజలు వారిని ఏనాటికీ క్షమించరు. సో.. ఎంపీలూ.. తస్మాత్‌ జాగ్రత్త !