అమర జవాన్లకు అవమానం

నివాళులర్పించని రాజకీయ నేతలు
శ్రీనగర్‌, మార్చి 14 (జనంసాక్షి):
జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ జరిపిన ఆత్మాహుతి దాడిలో మరణించిన ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన  ఐదుగురు జవాన్లకు నివాళులు అర్పించే కార్యక్రమానికి రాజకీయ నేతలెవరూ పాల్గొనలేదు. దీంతో జవాన్లలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇది అమరజవాన్లను అవమానపరచడమేననిపలువురు వ్యాఖ్యానించారు. దేశ అంతరంగిక భద్రత కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టే జవాన్లకు రాజకీయ నాయకులు నివాళులు అర్పించకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. దేశానికి కీడు చేసేవారు చనిపోతే స్పందించే నాయకులు దేశాన్ని కాపాడే బాధ్యతలు చేపట్టే తమకు విధుల్లో ఉండగా మరణించినా కనీసం నివాళులు అర్పించడానికి కూడా రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. విమర్శలు వెల్లువెత్తుతుండడంతో చివరిక్షణంలో జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా విమానాశ్రయానికి చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు. దీంతో అమరవీరుల మృతదేహాలు స్వస్థలాలకు చేరాయి.