అమర జవాన్‌ కుటుంబానికి అండగా ఉంటా

– షేక్‌పురా కలెక్టర్‌ ఇనాయత్‌ ఖాన్‌
పాట్నా, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): అమర జవాన్‌ల కుటుంబాలకు అండగా ఉంటానని, వారి కుటుంబాలను దత్తత తీసుకుంటామని బీహార్‌ రాష్ట్రంలోని షేక్‌పురా జిల్లా కలెక్టర్‌ ఇనాయత్‌ ఖాన్‌ అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. పుల్వామా ఉగ్రదాడిలో బీహార్‌కు చెందిన ఇద్దరు జవాన్లు సంజయ్‌ కుమార్‌ సిన్హా, రతన్‌ కుమార్‌ ఠాకూర్‌ వీరమరణం పొందిన విషయం తెలిసిందేనన్నారు. ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని షేక్‌పురా జిల్లా కలెక్టర్‌ ఇనాయత్‌ ఖాన్‌ వెల్లడించారు. తమ జిల్లాలో ఒక అకౌంట్‌ ఓపెన్‌ చేసి విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. మార్చి 10వ తేదీ వరకు విరాళాలను సేకరించి.. వచ్చిన డబ్బును రెండు భాగాలుగా చేసి అమర జవాన్ల కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకొని వారికి అండగా ఉంటానని కలెక్టర్‌ పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో మొత్తం 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అమర జవాన్ల కుటుంబాలకు పలు రాజకీయ పార్టీల నాయకులు, సెలబ్రెటీలు, ప్రజలు తమకు తోచినంతగా ఆర్థిక సాయం చేస్తున్నారు.

తాజావార్తలు