అమెరికా తొలి మహిళా వ్యోమగామి శాలీ రైడ్‌ కన్నుమూత

న్యూయార్క్‌: అమెరికా నుంచి అంతరిక్షయాత్ర చేసిన తొలి మహిళ శాలీరైడ్‌ సోమవారం మరణించారు. 61 సంవత్సరాల శాలీరైడ్‌ పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ శాస్‌డీగోలోని స్వగృహంలో కన్నుమూశారని ఆమె స్థాపించింన సంస్థ శాలీ రైడ్‌ సైన్స్‌ పేర్కొంది. భౌతిక శాస్త్రవేత్త అయిన డాక్టర్‌ శాలీ రైడ్‌ 1978లో అమెరికన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యారు. 1983లో (ఆరు రోజులు),1984లో (8 రోజులు) రెండు సార్లు అంతరిక్షయాత్ర చేసిన శాలీ తొలి అమెరికన్‌ మహిళగానే కాక, పిన్నవయస్కురాలిగా కూడా రికార్డు సృష్టించారు. అప్పుడామె వయసు 32 ఏళ్లు మాత్రమే. ఆమె ప్రయాణించిన ఛాలెంజర్‌, కొలంబియా రెండు అంతరిక్షనౌకలు ఆ తర్వాత ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అంతరిక్షయాత్రకు ఎంపికైన తొలి మహిళగా ఆనాడు మాట్లాడుతూ ఆమె మహిళా ఉద్యమాలు తన మార్గాన్ని సుగమం చేశాయని పేర్కొన్నారు.