‘అమ్మ’లకు ఆహ్వానం పలుకుతున్న కార్పొరేట్‌ సంస్థలు

బెంగళూరు, జూలై 6: సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’. మాతృత్వం కోసం మహిళ అన్నింటినీ త్యాగం చేస్తోంది. నేడు నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చన్నీళ్లకు వేణ్ణిల్లు తోడుచేస్తే సంసారం సాఫీగా సాగుతుందని భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళుతున్నారు. ఆఫీసు పని వేళలు, పని ఒత్తిడి వల్ల చాలా మంది మహిళలు మాతృత్వ మమకారానికి దూరం అవుతున్నారు. యువతి వయస్సు 35 దాటితే గర్భం దాల్చినా పలు రకాల సమస్యలు ఉత్పన్నమవుతుందటంతో ఉద్యోగాలను సైతం వదిలేస్తున్నారు. దాదాపు 26 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల యువతులు అధిక మొత్తంలో వచ్చే జీతాలను సైతం కాలదన్ని, కార్పొరేట్‌ ఉద్యోగాలను వదులుకుంటున్నారు. కన్నతల్లి అనిపించుకోవటం కోసం కామధేనువు లాంటి ఉద్యోగాలను వదులుకోవటం ఇండియాలోనే ఎక్కువగా ఉంది. దాదాపు 1.5 మిలియన్‌ మహిళలు కార్పొరేట్‌ ఉద్యోగాలను వదులివేస్తున్నారు. తల్లి అయిన తరువాత 2 నుంచి 10 సంవత్సరాల తరువాత మళ్లీ వచ్చి ఉద్యోగాల్లో చేరుతున్నారు. తల్లి అయిన మహిళల్లో 90 శాతం మంది తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారు. 20 శాతం మంది మాత్రం వివిధ కారణాల రీత్యా వదిలివేస్తున్నారు.
ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కార్పొరేట్‌ సంస్థలు కూడా తమ పంథాను మార్చుకుంటున్నాయి. ఐబీఎం, కాగ్నిజెంట్‌, జెంటాక్ట్‌, కొటాక్‌ గ్రూప్‌, హెచ్‌యూఎల్‌, ఫెడిలిటీ, మైక్రోసాఫ్ట్‌, ఒడాఫోన్‌, హెచ్‌ఎస్‌బీసీ , ఏబీబీ, బ్రిటానియా తదితర కంపెనీలన్నీ ‘సెకండ్‌ కెరీర్‌’ పేరుతో మహిళలను ఆహ్వానిస్తున్నాయి. పనిని సమర్థంగా, నేర్పు, ఓర్పుతో చేయగల సత్తా మహిళల్లో ఉంది కాబట్టి కార్పొరేట్‌ సంస్థలు మాతృత్వం కోసం ఉద్యోగాలు వదిలేసుకున్న వారికి మళ్లీ ఆహ్వానించి పెద్దపీట వేస్తున్నాయి. అంతర్జాతీయ బహుళ సంస్థలు సైతం ‘సెకండ్‌ కెరీర్‌’ పేరుతో పెద్ద పీట వేస్తున్నాయి. ఇంటర్వేవ్‌ కన్సల్టెంట్‌ సీఈఓ నిర్మలా మీనన్‌ మాట్లాడుతూ కంపెనీలు ఇలాంటి మహిళల కోసం తమ హెచ్‌ఆర్‌ విధానంలోనే మార్పులు చేసుకోవటం ఆహ్వానించదగిన పరిణామమని పేర్కొన్నారు. మహిళల సామర్థ్యాన్ని గుర్తించి కార్పొరేట్‌ సంస్థలు వారిని తిరిగి ఆహ్వానించి ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడం పురుష ఉద్యోగులకు నచ్చడంలేదు. తమ అవసరాల కోసం ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోయిన వారిని మళ్లీ ఆహ్వానించి తమ మీద బాస్‌లుగా వేయటమేమిటని పురుష ఉద్యోగులు మండిపడుతున్నారు. తల్లులు అయిన ఉద్యోగినులు వృత్తిరీత్యా ఒక్కొక్కసారి మాతృత్వ మమకారాన్ని వదులుకోకతప్పటడంలేదు. వారాల తరబడి క్యాంప్‌ల పేరుతో వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిరావటం, రాత్రి డ్యూటీ సమయాల్లో వారిని తీసుకెళ్లటానికి కుటుంబ సభ్యులు రావాల్సి వస్తోంది. నాయకత్వ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగినుల ఇబ్బందులను యాజమాన్యాలు గుర్తిస్తున్నాయని, ఇటువంటి సమయంలో వారితో సానుకూలంగా మాట్లాడి, వారి అవసరాలకు తగ్గట్టు సౌకర్యాలను కల్పిస్తున్నాయని సీఈఓ మీనన్‌ అంటున్నారు. కెరీర్‌ క్రియటర్స్‌ ప్రెసిడెంట్‌ సుందరయ్య రాజేశ్‌ ‘సెకండ్‌ కెరీర్‌’ పై మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా 4వేల మంది మహిళలను ఉద్యోగాల్లో చేర్పించామనితెలిపారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న భారత దేశంలో మహిళలు ఇలా ‘సెంకడ్‌ కెరీర్‌’ ప్రారంభించటాన్ని గిల్టీగా భావించక, ఆనందంగా స్వీకరించేందుకు ముందుకు రావటం మంచిపరిణామమని అంటున్నారు.