అర్హత ఉన్న రైతులకే యంత్ర పరికరాలు

– శాసన మండలిలో మంత్రి పోచారం

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో నిజమైన రైతులకే ట్రాక్టర్లు, పరికరాలను అందించటం జరుగుతుందని, ఈ పథకంలో ఎలాంటి అవకతవకలకు తావులేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం శాసనమండలిలో జరిగిన చర్చలో ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నవారికి సగం బ్యాంకు రుణం, మిగిలిన సగం ప్రభుత్వ రాయితీతో ట్రాక్టర్లు ఇస్తున్నామని తెలిపారు. గతంలో పలువురు అనర్హులకు ఈ ట్రాక్టర్ల పంపిణీ జరిగిన మాట వాస్తవమే అని, వారిపై తగు చర్యలు కూడా తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులకు అర్హత ఉన్న రైతులకు, పార్టీలకు అతీతంగా పరికాలు అందించేలా ఆదేశాలు సైతం జారీ చేయటం జరిగిందన్నారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం అర్హులకు కాకుండా అనర్హులకే వరంలా మారిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, షబ్బీర్‌ అలీ ఈ అంశాన్ని లేవనెత్తారు. వ్యవసాయం చేయనివారికి కూడా ట్రాక్టర్లు ఇచ్చారని ఆరోపించారు. దీనికి సంబంధించిన జాబితా ప్రభుత్వం బయటపెడితే అనర్హులు తీసుకున్న విషయాన్ని తాము నిరూపించగల్గుతామని సవాల్‌ చేశారు. తాము సిఫారసు చేసినవారికి ఎవరికీ అధికారులు ట్రాక్టర్లు ఇవ్వడంలేదని ఆవేదన వారు వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంత్రి కలుగుజేసుకొని పార్టీలకతీతంగా అమలు చేయాల్సిన పథకాలు అధికార పార్టీకి అనుకూలంగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణల్ని శ్రీనివాస్‌రెడ్డి తోసిపుచ్చారు.