అవసరమైతే విప్ ధిక్కరిస్తాం మధుయాష్కీ స్పష్టీకరణ
వైఎస్సార్ సీపీలో చేరే వారంతా ద్రోహులే
హైదరాబాద్, నవంబర్ 21 :పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ అంశంపై తేల్చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని నిజామాబాద్ ఎంపీ మధయాష్కీ తెలిపారు. తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ విప్‌ను సైతం ధిక్కరిస్తామని కాంగ్రెస్ హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రాంత ఎంపీలంతా ఐక్యంగానే ఉన్నారని ఆయన చెప్పారు. బుధవారం యాష్కీ విూడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణపై ఒత్తిడి తేవడానికి అవిశ్వాస తీర్మానం ఉపయోగించుకుంటామని చెప్పారు. తెలంగాణకు ప్యాకేజీలు, పదవులు అంటే సమస్యను నాన్చడమేనని మండిపడ్డారు. తమకు ఏ ప్యాకేజీలు, పదవులు అక్కర్లేదని, తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది బాబు రాజ్యం, రాజన్న రాజ్యం కాదని.. తెలంగాణ రాష్ట్రం కావాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ, టీఆర్‌ఎస్ తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పార్టీలు మారితే ఆయా పార్టీలు బలోపేతం అవుతాయే తప్ప తెలంగాణ సమస్య పరిష్కారం కాదన్నారు. వైఎస్సార్ సీపీలోకి చేరుతున్న వారిపై యాష్కీ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారంతా తెలంగాణ ప్రాంత ద్రోహులేనని అన్నారు. తెలంగాణను కోరుకునే వారెవరు జగన్ పార్టీలోకి వెళ్లరని తెలిపారు. అవినీతి, అక్రమాలకు మారు పేరైన జగన్ పార్టీకి తెలంగాణలో తావుండదన్నారు. అవసరమైతే విప్ ధిక్కరిస్తాం.



