అవినీతికి కేంద్రంగా మారిన హైదరాబాద్‌ : కిరణ్‌బేడీ

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ అవినీతికి కేంద్రంగా మారిపోయిందని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, అన్నా బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన అన్నా బృందం సభ్యులు బుధవారంలో మీడియాతో మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల నగరంగా ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నేడు అవినీతికి రాజధానిగా మారిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తమకు ఈ రాష్ట్రంలో వెలుగుచూస్తున్న స్కామ్‌లు, అవినీతి, అక్రమాలు,అక్రమాస్తుల కేసులో అరెస్టులు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. లోక్‌పాల్‌ బిల్లుకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. అవినీతి కేసులను వేగవంతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి కేసుల దర్యాప్తునకు స్వయం ప్రతిపత్తి సంస్థ ఉండాలని ఆమె డిమాండ్‌ చేశారు. అవినీతి నిరోధానికి బలమైన న్యాయవ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. బలమైన జనలోక్‌పాల్‌, లోకాయుక్త బిల్లు కావాలని కిరణ్‌బేడీ డిమాండ్‌ చేశారు. ఈ బిల్లును పటిష్టంగా రూపొందిస్తామని స్వయంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నా హజారేకు లేఖ రాశారని, అయినా అది కార్యరూపం దాల్చలేదని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఒక కుంభకోణం ఉదంతం పూర్తికాక ముందే మరొకటి వెలుగు చూస్తోందని ఆమె విమర్శించారు.తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓటు కోసం కుటుంబానికి 15వేల రూపాయలు ఇచ్చిన సంఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక్క బెయిలు కోసం కోట్ల రూపాయల లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం ఈ రాష్ట్రంలోనే జరిగిందన్నారు. ఇదంతా నల్లధనం కాక మరేమిటని కిరణ్‌బేడీ ప్రశ్నించారు. ఇలాంటి మరెన్నో వెలికి తీయాలంటే స్వతంత్రం దర్యాప్తు సంస్థలు, పటిష్టమైన న్యాయవ్యవస్థలు అవసరమన్నారు. తామంతా దీని కోసమే పోరాడుతున్నామన్నారు. బొగ్గు గనుల కేటాయింపులపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కిరణ్‌బేడీ డిమాండ్‌ చేశారు.