ఆగివున్న లారీని ఢీకొన్న అంబులెన్స్‌

అనంత ప్రమాదంలో నలుగురు గుంటూరు రైతుల మృతి
అనంతపురం,మార్చి19(జ‌నంసాక్షి): అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.  పెదవడుగూరు మండలంలో మంగళవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి అనంతపురం గ్రామ సవిూపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు రైతులు  పనివిూద అనంతపురం బయలుదేరి వెళ్లారు. డోన్‌ వరకు రైలులో వచ్చిన వారు అక్కడి నుంచి సోమవారం రాత్రి అనంతపురం వెళ్లేందుకు ఓ అంబులెన్స్‌ ఎక్కారు. పెదవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామ సవిూపంలో ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులిద్దరినీ గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై రమేశ్‌రెడ్డి సంఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద విషయాన్ని స్వగ్రామంలో వారికి తెలియచేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.