ఆప్‌తో పొత్తు ఉండదు

– రాహుల్‌ ఈవిషయంపై స్పష్టత ఇచ్చారు
– ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌
న్యూఢిల్లీ, మార్చి5(జ‌నంసాక్షి) : ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు ఖాయమైందని, లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేసేందుకు ఒప్పుకుందని మంగళవారం విస్తృత ప్రచారం జరిగింది. కాగా
దీనిని కాంగ్రెస్‌ నేతలు ఖండించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)తో పొత్తు ప్రసక్తే లేదని ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో మంగళవారం సమావేశమైన అనంతరం ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం ఏకగ్రీవమని తెలిపారు. దీంతో పొత్తుపై కొంతకాలంగా వస్తోన్న ఊహాగానాలకు ఆమె చెక్‌ పెట్టారు.
ఇటీవల కోల్‌కతాలో జరిగిన విపక్షాల ఐక్యత ర్యాలీ సందర్భంగా.. విభేదాలను పక్కనబెట్టి ఢిల్లీలో పొత్తు పెట్టుకోవాలని ఇతర విపక్ష నేతలు కాంగ్రెస్‌, ఆప్‌లను కోరారు. అయితే రాహుల్‌గాంధీ మాత్రం ఢిల్లీలో తమది ఒంటరిపోరేనని సూచన ప్రాయంగా వెల్లడించారు. దీంతో అసంతృప్తి గురైన ఆప్‌..లోక్‌సభలో ఒంటరి పోరుకు సిద్ధమై ఆరుగురు అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. అయితే దేశ రాజధానిలో ఒంటరిగా పోటీ చేయాలన్న కాంగ్రెస్‌ నాయకుల నిర్ణయాన్ని మంగళవారం జరిగిన సమావేశంలో రాహుల్‌ అంగీకరించినట్లు షీలా వెల్లడించారు. తమ పార్టీ ఏడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి, విజయం సాధిస్తుందని తెలిపారు.