ఆర్టీసీలో అవినీతి నిర్మూలించాలి

C
– దుబారా తగ్గించాలి

– సంస్థ మనదన్న భావన అందరికీ రావాలి

– సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష

హైదరాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి):ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సంస్థలోని అధికారులు, సిబ్బంది కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ఆర్టీసీ బలపడితే లబ్దిపొందేది ప్రథమంగా కార్మికులేనని అన్నారు. ఆర్టీసీ బలోపేతంపై కేసీఆర్‌ శుక్రవరాం విస్తృత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ… ఆర్టీసీ ప్రయాణికుల ద్వారానే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానూ ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు.  కొరియర్‌, సరుకు రవాణా, మినీ బస్సులు ఏర్పాటు ద్వారా అధిక ఆదాయం పొందాలన్నారు.  బస్టాండ్లు, బస్సులపై వాణిజ్య ప్రకటనలు పెంచేందుకు చర్యలు చేపట్టారు. తిరుపతి, షిర్డీ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రయాణికులకు దైవదర్శనం, వసతి విషయాల్లో ప్రాధాన్యమివ్వాలి.శబరిమల, కొండగట్టు, బెంగళూరు, తిరుపతి లాంటి ప్రదేశాలకు పండుగ వేళల్లో మినీ బస్సులను నడపాలని సూచించారు. వ్యాపార ప్రకటనలు పెంచాలని తెలిపారు.జాతరలు, బ్ర¬్మత్సవాలకు ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. పాఠశాలలు, విద్యా సంస్థల టూర్‌కు కూడా ఆర్టీసీ బస్సులనే వాడేలా చూడాలని పేర్కొన్నారు. డిమాండ్‌ ఉన్న రూట్లను గుర్తించి సర్వీసులను పెంచాలన్నారు. వరంగల్‌, నిజామాబాద్‌కు ఏసీ మినీ బస్సులు ప్రయోగాత్మకంగా నడపాలని సూచించారు. ఆర్‌ఎంలు, డీఎంలు ప్రతీ 15 రోజులకోసారి సమావేశం కావాలని ఆదేశించారు. బస్టాండ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓఆర్‌తోపాటు సరుకు రవాణా పెంచాలన్నారు. ముఖ్యంగా సమయ పాలన పాటించాలని తెలిపారు.  పర్యాటకశాఖతో ఆర్టీసీని అనుసంధానం చేసి ఆదాయం పెంచుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.  దూరప్రాంతాలకు బస్సుల సంఖ్య పెంచాలి. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు విహారయాత్రల కోసం ఆర్టీసీ బస్సులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీ బలోపేతంపై గురువారం కూడా కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. నిత్యం 90లక్షల మంది ప్రయాణిస్తున్నా ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయంటే కారణాలు విశ్లేషించాలన్నారు. పన్నులు చెల్లిస్తూ ప్రైవేటు బస్సులు లాభాలు ఆర్జిస్తుంటే ఆర్టీసీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ నుంచి గ్రేటర్‌ ఆర్టీసీకి ఏడాదికి కనీసం రూ.190 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. రాజకీయ కారణాలతో చేపట్టే సమ్మెల నుంచి ఆర్టీసీ మినహాయించాలని కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే నష్టాల్లో సాగుతున్న సంస్థ అవస్థల పాలవ్వకుండా చూడాలన్నారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులకు కేటాయింస్తోందని తెలిపారు. నష్ట నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌ బస్సులను జీహెచ్‌ఎంసీకి అప్పగించినట్లు తెలిపారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌ పెంచామని… అయినా సమ్మె చేస్తే నష్టాలు పెరుగుతాయన్నారు. ఇలా నడపడం కంటే సంస్థను మూసివేస్తే మంచిదని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. కార్మికులు సహకరిస్తే ఆర్టీసీని నడుపుదాం లేదంటే వదులుకుందామన్న ప్రతిపాదన సమావేశంలో వచ్చినట్లు సమాచారం. అందుకే సమావేశంలో ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు అధికారులు, కార్మికులు అందరు కలిసికట్టుగా కృషి చేయాలని సీఎం  అన్నారు. ఆర్టీసీకి అనుభవం ఉన్న ఛైర్మన్‌ను, ఉన్నతాధికారులను నియమించామని తెలిపారు. దీనిని సదవకాశంగా తీసుకుని ఆర్టీసీని లాభాల బాట పట్టించాలన్నారు. సృజనాత్మకతతో ఆలోచించి కొత్త విధానాలతో ఆదాయం పెంచే వ్యూహాలు రూపొందించుకోవాలని సూచించారు. అనుకుంటే సాధ్యంకానిదేదీలేదని పేర్కొన్నారు. తాను రవాణా మంత్రిగా ఉన్నపుడు డిపోల వారీగా సవిూక్షలు జరిపి వాస్తవాలను అర్థం చేసుకుని గట్టిగా ప్రయత్నించానని వివరించారు. దీనివల్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టించగలిగామని తెలిపారు. తలుచుకుంటే సాధ్యంకానిదేవిూ లేదన్నారు. ఇపుడు తెలంగాణలో 95 ఆర్టీసీ డిపోలున్నాయని వాటిలో కేవలం 5 డిపోలు మాత్రమే లాభాల్లో ఉండటం సిగ్గుచేటన్నారు ఈ పరిస్థితిలో మార్పు రావాలని అన్నారు. ఇందు కోసం అధికారులు, కార్మికులు కష్టపడి పనిచేయాలని కోరారు. కార్మికులు కూడా చీటికిమాటికి సమ్మె అనడం వల్ల నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. యాజమాన్యం, కార్మికులు వేర్వేరు అనే పద్ధతిలో ఆలోచించొద్దన్నారు. అందరూ కుటుంబ సభ్యుల్లా పనిచేయాలని తెలిపారు. 6 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో కేవలం వెయ్యి మంది మాత్రమే అధికారులు, 55 వేల మంది కార్మికులు అనే విషయాన్ని మరవరాదన్నారు. ఆర్టీసీ కార్మికులది, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులదేనని తెలిపారు. ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేట్‌ ఆపరేటర్లకు రవాణా పర్మిట్లు ఇవ్వాలని కేంద్రం ప్రయత్నిస్తే తాను వ్యతిరేకించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడానికి ప్రధానికి లేఖ కూడా రాశానని తెలిపారు. ఆర్టీసీలో అవినీతిని పూర్తిగా తగ్గించాలని సూచించారు. దుబారా కూడా లేకుండా చూడాలన్నారు. టికెట్‌ ఇవ్వకుండా అవినీతికి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇంటర్‌ డిస్టిక్ట్‌ పర్మిట్లు తీసుకునే ప్రైవేట్‌ ఆపరేటర్లు నిబంధనలు పాటించకుండా పర్మిట్లను దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమంగా సర్వీసులను నడుపుతున్నారని అన్నారు. ఫలింగా ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. దీనిపై రవాణా, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రైవేట్‌ ఆపరేటర్లను క్రమబద్దీకరించా లన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు.  అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ ఆర్టీసీ)ని దేశంలో నెంబర్‌వన్‌గా తీర్చి దిద్దుదామని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందు కోసం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామని ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనలు, ఆదేశాలను పాటించి ఆర్టీసీని అత్యుత్తమ సంస్థగా తీర్చి దిద్దుదామని పేర్కొన్నారు.