పోలీసులకు కౌశిక్‌రెడ్డి క్షమాపణలు
` ఉద్దేశపూర్వకంగా అనలేదని వెల్లడి
కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క`సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై భారత రాష్ట్రసమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు క్షమాపణలు చెబుతున్నట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు. తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, పోలీసుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలన్నారు. సీఎం ప్రోద్బలంతో తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని చెప్పారు. పోలీసులు, అధికారులంటే తనకు ఎంతో గౌరవమన్నారు. సమ్మక్క జాతరకు వెళ్తుండగా అడ్డుకుని తీవ్ర ఒత్తిడి చేశారని.. ఆ సమయంలో నోరు జారానని, ఉద్దేశపూర్వక మాటలు కావని పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే?
కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క`సారలమ్మ జాతరలో దళిత సర్పంచి సరోజను కొబ్బరికాయ కొట్టనివ్వడం లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి నిరసన తెలిపారు. సమ్మక్క గద్దెకు చేరిన తరువాత మొదటి కొబ్బరికాయ తామే కొడతామని ఆయన భీష్మించారు. దళిత మహిళా సర్పంచిని అవమానించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు సర్దిచెప్పినా వినలేదు. దీంతో కౌశిక్‌రెడ్డితోపాటు ఆయన సతీమణిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులను గద్దెల వద్దకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మెడలు పట్టి వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం రాగానే ఇలాంటి వారి అంతుచూస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు ఆయనను సైదాపూర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతకుముందు కూడా హుజూరాబాద్ నుంచి వీణవంకకు బయలుదేరిన కౌశిక్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత వాహనాలనే అనుమతిస్తామని చెప్పడంతో ఆయన వాగ్వాదానికి దిగారు. అనంతరం భార్య, కుమార్తెతో కలిసి వరంగల్`కరీంనగర్ రహదారిపై బైఠాయించారు. తన స్వగ్రామానికి వెళ్లడాన్ని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు నాలుగు వాహనాలకు అనుమతివ్వగా.. కౌశిక్‌రెడ్డి వీణవంకకు తరలివెళ్లారు. విద్వేషాలు ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు, అనుమతులు లేకుండా ఆందోళన చేయడంపై పలు సెక్షన్ల కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ టి.కరుణాకర్ తెలిపారు.
ఐపీఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆరఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ’ఎవరినీ ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో నాపై, నా కుటుంబం పై రాజకీయ కక్షకు తెగబడ్డారు. పోలీసులు, అధికారులు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు.. మేము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో అడ్డుకొని, తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారాను. అంతే తప్ప ఉద్దేశ్య పూర్వకంగా అన్న మాటలు కావు. నా మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని తప్ప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని అందరిని వేడుకుంటున్నాను.’ అని అభ్యర్థిస్తూ కౌశిక్ రెడ్డి వీడియో విడుదల చేశారు. గురువారం నాడు వీణవంకలోని స్థానిక సమ్మక్క సారలమ్మ జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లారు. ఆ సమయంలో పోలీసులకు, కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన కౌశిక్ రెడ్డి.. ఐపీఎస్ అధికారిని మతం పేరుతో దూషించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం.. కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన కౌశిక్ రెడ్డి.. పోలీసులకు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు. తన క్షమాపణల అనంతరం ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కౌశిక్ రెడ్డి కోరారు. అయితే ఐపీఎస్ అధికారిపై బీఆరఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ పేర్కొంది. మతం పేరుతో ఆరోపణలు చేయడం దారుణమని చెప్ప్పుకొచ్చింది. కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిపై వ్యక్తిగత దాడి చేశారని అసోసియేషన్ మండిపడింది. మత మార్పిడుల ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని తెలంగాణ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ ఘటన సివిల్ సర్వీస్ అధికారుల మనోబలాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపింది. ఎమ్మెల్యే ప్రవర్తనపై తక్షణ విచారణకు డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే నుంచి బహిరంగ క్షమాపణ కోరింది. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారి మతమార్పిడికి ప్రయత్నిస్తున్నారని తప్ప్పుడు ఆరోపణలు చేస్తూ.. అతని మతం గురించి చేసిన ఆరోపణలతో తీవ్రంగా కలత చెందుతున్నామని పేర్కొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి క్షమాపణలు తెలిపారు.



