ఆర్టీసీ కార్మికుల రక్తదానం

ఏలూరు, జూలై 29 : సమాజ సేవా కార్యక్రమాలలో భాగంగా ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున రక్తదానం చేసినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రవికుమార్‌ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఆర్టీసీ ఆసుపత్రిలో ఆదివారం ఉచిత రక్తదానం శిబిరాన్ని రవికుమార్‌ ప్రారంభించి రక్తాన్ని దానం చేసారు. 50మందికిపైగా ఆర్టీసీ కార్మికులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఆర్టీసీ జిల్లా ముఖ్య కంట్రోలర్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా నేడు రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఆధునిక యుగంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ స్థితిలో బస్సులు నడపడం ఎంతో కష్టంగా మారిందని అయినాసరే ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో ఓర్పుతో ప్రమాదరహిత ప్రయాణానికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ద్విచక్రవాహనదారులు ఇష్టానుసారంగా నడపడం వల్ల కొన్ని చోట్ల ప్రమాదాలకు కారణమవుతున్నాయని అతివేగంతో వెళ్లే ద్విచక్ర వాహన దారులను నియంత్రించాలని కృష్ణమూర్తి చెప్పారు. ఆర్టీసీ ప్రతి నిత్యం పల్లె ప్రాంతాలకు బస్సులను నడుపుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన సేవలు అందించి ప్రజలకు చేరువ అవుతామని కృష్ణమూర్తి అన్నారు. ఆర్టీసీ కార్మికులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి మనిషీ ఏడాదిలో రెెండు సార్లు రక్తాన్ని దానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని అప్పుడే మానవత్వం అనిపించుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు బ్లడ్‌ బ్యాంక్‌ సూపరింటెండెంట్‌ శ్యామ్‌సుందర్‌, ప్రభుత్వాసుపత్రి సలహా సంఘ సభ్యులు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.