ఇంకెంతమంది బిడ్డలను బలితీసుకుంటారు

తెలంగాణ ప్రకటించండి
ఏఐసీసీ కార్యాలయం ముందు అమరవీరుల కుటుంబ సభ్యుల ధర్నా

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం ఎదుట తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారుఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో జాప్యం కారణంగా తమ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్లనే తమ బిడ్డలను పోగొట్టుకోవాల్సి వచ్చిందని వారు ఆరోపించారు.తమ బిడ్డల చావులకు ఎవరు బాధ్యతవ హిస్తారని వారు సూటిగా ప్రశ్నించారు. ఇప్పటి వరకు 700 మందికి పైగా తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు,ఆత్మబలిదానాలకుపాల్పడ్డారని,ఈ మరణాలకు యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డల ఆత్మశాంతించాలంటే, మరికొందరు బిడ్డలు ఆత్మబలిదానాలకు పాల్పడకుండా ఉండాలంటే సత్వరమే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని అమరవీరుల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లేకుంటే తమ బిడ్డల ఉసురు తగులుందని శపించారు. న్యాయవాది అరుణ్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళన జరిగింది.