ఇంగ్లాండు చేతిలో అఫ్గాన్‌ చిత్తు

కొలంబో: ఓడిపోతున్న తరుణంలోనూ అఫ్గాన్‌ బ్యాట్స్‌మన్‌ గుల్బోదీన్‌ నయిబ్‌ తెగువ ప్రదర్శించాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సీక్స్‌లతో 44 పరుగులు చేసి చివరకు డెర్మ్‌బ్యాచ్‌కు దొరికిపోయాడు. దాంతో ఇంగ్లాండుపై అఫ్గాన్‌ చిత్తుడా ఓడిపోయింది. అఫ్గాన్‌ 116 పరుగులు తేడాతో ఇంగ్లాండుపై ఓడిపోయి, ఇంటి దారి పట్టింది. ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్‌ ఏ గ్రూప్‌లో రెండు మ్యాచులు ఆడిన ఆఫ్గాన్‌ ఆ రెండింటిలోనూ ఓడిపోయింది. ఇంగ్లాండు బౌలర్లు ముందు అఫ్గాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. గుల్బోదీన్‌ తప్ప మిగతా వారెవరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. వరుసగా వికెట్లు సమర్పించుకంటూ వెళ్లారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ అయ్యారు. అఫ్గాన్లు 17.2 ఓవర్లు ఆడి 80 పరుగులకు ఆలవుట్‌ అయ్యారు. ఒక సందర్భంలో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 26 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన సందర్భంలో గుల్బోరీన్‌ దూకుడు ప్రదర్శించి స్కోరును ఆ మాత్రం స్థాయికి తీసుకుని రాగలిగాడు. తోలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండు నీర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లూక్‌ రైట్‌ అఫ్గాన్ల బౌలర్లను దంచి కొట్టాడు. 55 బంతుల్లో 99 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. అతని స్కోరులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. అఫ్గాన్లు క్యాచులు డ్రాప్‌ చేయడమే పెద్ద సమస్యగా మారింది. ఇండియాతో జరిగిన మ్యాచులోనూ ఇదే జరిగింది. హేల్స్‌ 31 పరుగులు చేసి రన్నవుట్‌ అయ్యాడు. మోర్గాన్‌ 23 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అఫ్గానిస్తాన్‌ బౌలర్లలో ఇజాతుల్లా దవ్లాత్జాయ్‌ రెండు వికెట్లు తీసుకోగా, షాపూర్‌ జద్రాన్‌, దవ్లాత్‌ జద్రాన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.