“ఇది నిజం నేనే “

అవును..నేనే
మిమ్ముల చూస్తున్నది నేనే…
నన్ను చూస్తున్నది మీరే..
నాకు నేనే కానీ మీతోనే నేను
అంతానేనే కాదు..అందరితో నేను
మీరు లోపల అనుకున్నది నన్నే..
నేను లోపల అనుకున్నది మిమ్మల్నే…

నేను మనిషినే మీరు మనుషులే..
సమాజంలో నేనే సమాజంతో నేనే..
ఎవరితో ఎవరో కానీ అందరితో నేను..
నాకు నేనే పెద్ద కానీ మీతోనే ఉంటా ..
కన్నీళ్ళలోనుంచి పుట్టిన కసి
స్పృహలోనుంచి వచ్చిన అక్షరాలు
అందరి కృషిలోనుంచి పుట్టిన నేను
మీ అందరి ఆత్మీయ మొగ్గలోంచి
నిగ్గుతేల్చే నిక్కర్సైన అక్షర కవాతును!!…

సమాజ తెరమీద నేనే పాత్రదారుని
స్పష్టంగా చూపిస్తా వాస్తవాన్ని వినిపిస్త…
శాస్త్రీయ దృక్పథంతో నడుస్తున్నా…
మీ ప్రేమ నరాలిని లాగుతున్నా…
మీ జీవనం వృక్షమీద వాలుతుంట!..

మీ నాగేటి సాలలో
నా అక్షరాల విత్తులను  నాటుత..
నాకు నేనుగా మీలోనే చిగురిస్త..
మీలో ఒక వైరుధ్యమైన అంశంగా నిలుస్త…
బలమైన మీ మౌనంలో
ఓ మానవీయ గీతమై సేద తీర్చుత…
మీ జ్ఞాపకాల కాంతిలో వెలుగుతుంట!..

ఉదయం వస్తుంది విజయం తెస్తుంది
చైతన్యాన్ని ఇచ్చే మాటలు…
చేయూత నిచ్చే చేతలు…
గుండెలో కలతగా  మనసులొ వెలితిగా…
నేను పాతనే నాలోని తత్వం కొత్తది!..
మీరు వింటున్నది నిజం!..
నేను అంటున్నది నిజం!…

మీలోని లోపాన్ని నాలోని తాపాన్ని
ఉలికిపడే ఊహల్ని వదిలించడమే నేను!..
మీ మౌనంతో ముడిపడి
మీ మనసుతో జతకూడి
ప్రగతిశీల వైపు పరుగులు తీయాలి…
నాపదాలకు రంగులద్దండి
మీఇంటి గుమ్మం ముందు రంగవల్లులై నిలుస్థాయి!….

నాలోని లోకాన్ని చూపిస్తా!…
మీలోని శోకాన్ని నిర్మూలిస్తా!…
పోటెత్తే మాటలు మీవి ..
పొత్తుకూర్చుకునే మాటలు నావి..
కన్నీటితో కథలు రాయలేను
పన్నీటితో మీ వేతల్ని తీర్చలేను…
అయినా నాకునేనే కానీ మీతోనే నేను..
అందరం కలిసి ఉంటేనే అందం..
నాకు మీరు మీకు నేను ఉంటేనే బంధం
మన మధ్య హద్దులు వద్దు..ఇది నిజం!!….

అంబటి నారాయణ
నిర్మల్
9849326801