ఇసుక అక్రమాలపై ఇక కఠిన చర్యలు

అనంతపురం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఇసుక అక్రమాలు తెలిసీ ఉద్యోగులు మౌనంగా ఉంటున్నారని కలెక్టర్‌ కోన శ్రీధర్‌ ఉద్యోగులపై మండిపడ్డారు. జిల్లాలో ఇసుక అక్రమ రావాణ అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో కఠినంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా దీనిపై కఠినంగా చర్యలకు ఉపక్రమించారు. వెలుగు ఏపీఎం, ఏసీ, డీపీఎంల సమావేశంలో కలెక్టర్‌ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకుంటున్న జీతానికి బాధ్యతగా పనిచేయాలని  కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక విక్రయాల్లో ఎక్కడ ఏం జరిగింది… జరుగుతుందో అంతా తెలిసినా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని అన్నారు. త్వరలో ప్రతీ మండలంలోనూ ఇసుక రీచ్‌, విక్రయాలు మొదలవుతాయి. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఏదైనా తేడా వస్తే తన పెన్ను మాట్లాడుతుందని పేర్కొన్నారు. రవ్వ ఇసుక కూడా అక్రమంగా తరలిపోకూడదన్నారు. అక్రమాలకు పాల్పడితే నిర్దాక్షిణ్యంగా క్రిమినల్‌ కేసులు నమోదు చేయించడంతో పాటు  జీతం మొత్తం కక్కిస్తా. జాగ్రత్తా అని హెచ్చరించారు. మొన్నటికి మొన్న ఇసుక విక్రయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అంతా తెలుసని, అక్రమార్కులను ఇంటికి పంపిస్తానన్నారు. ఇక ఇసుక అక్రమరవాణాపై నిఘా పెంచాలని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సవిూక్షలో ఆయన ఇసుక అక్రమాలపై చర్చించారు. దందాలు, నకిలీ పాసుపుస్తకాలు, నకిలీ డాక్యుమెంట్లు, డబుల్‌ రిజిసేషెన్లకు పాల్పడే వారిని గుర్తించి కఠినంగావ్యవహరించాలన్నారు.   సంఘటనలు జరిగినప్పటినుంచి పోలీసుల పరంగా ఎలాంటిచర్యలు తీసుకున్నారన్నది ఆరా తీసారు. సరైన ఆధారాలు సేకరించకుండా, కేసు దర్యాప్తులో పురోగతి లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెంచాలన్నారు. దీంతో ఓ వైపు కలెక్టర్‌, మరోవైపు ఎస్పీ ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరించనున్నారు.