ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి బరిలో జశ్వంత్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి): భారత ఉప రాష్ట్రపతికి జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ బరిలోకి దిగారు. యూపీఏ ప్రతిపాదించిన అన్సారీ అభ్యర్థిత్వా న్ని వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. సోమ వారం నాడు ఎల్‌కె అద్వానీ నివాసంలో సమావేశంలో ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశంలో జశ్వంత్‌ సింగ్‌ను ఎన్డీయే తరుఫున నిలబెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అన్సారీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే ముందు యూపీఏ కూటమి తమను కనీసం మాట మాత్రంగా సంప్రదించకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్డీయే కూటమి తెలయజేస్తోంది. ఈ సందర్భంగా జశ్వంత్‌సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పదవికి తనను ప్రతిపాదించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి జేడీయూ నేత శరద్‌యాదవ్‌ కూడా హాజరయ్యారు. అన్సారీ అభ్యర్థిత్వంపై ఎన్డీయే విముఖత వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం గత పార్లమెంట్‌ సమావేశాల్లో లోక్‌పాల్‌ బిల్లుపై ప్రతిపక్షాలవాణి వినిపించడానికి అన్సారీ తగు విధంగా స్పందించకపోవడంతో ఆగ్రహంతో జశ్వంత్‌ను బరిలో నిలిపినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా. పెద్దలు కూర్చునే రాజ్యసభలో అతిముఖ్యమైన లోక్‌పాల్‌ బిల్లు విస్తృత స్థాయిలో చర్చ జరగాలంటే జశ్వంత్‌లాంటి అభ్యర్థి సరైన వాడని ఎన్డీయే భావిస్తోంది.