ఎన్నికలకు ముందే తెలంగాణ సాకారం :కేసీఆర్‌

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల  ఎజెండాలో తెలంగాణ అంశం ఉండాలని కోరుకోవడం లేదని టీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేకర్‌రావు అన్నారు. 2014 ఎన్నికలను ముందే తెలంగాణ కళ సాకారం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాజ్‌ మహాల్‌ హోటల్‌లో జరిగిన తెలంగాణ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 316 పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పోస్టులు ఉంటే అందులో కేవలం 123 పోస్టుల్లో  మాత్రమే తెలంగాకు చెందిన వారున్నారని ఆయన విమర్శించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామని ఆయన హామి ఇచ్చారు. తెలంగాణపై కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీ త్వరలో దిగి వస్తాయని చెప్పారు. కాంగ్రెస్‌ను  ప్రాసిక్యూట్‌ చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. కాగా, కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలో ఉందని  వివరించారు. ప్రజలు కరెంట్‌ అడిగితే కిటికీలు తెరుచుకుని పడుకుండి గాలి అదే వస్తదని ప్రభుత్వాధికారులు అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం త్వరలో ఇందిరమ్మ విసన కర్రల పథకం ప్రవేశ పెడుతుందని వ్యంగ్యాస్త్రం విసిరాయ. యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఇన్వర్టర్లు ప్రవేశపెట్టేలా ఉన్నారని చమత్కరించారు. కాగా, ఈ సమావేశంలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ.. సీఎం  కిరణ్‌కుమార్‌రెడ్డి పోలవరం కడతామని ఎలా అంటారని ప్రశ్నించారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని చెప్పిన సీఎం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడాతరని నిలదీశారు. సెప్టెంబర్‌ 30న జరపబోయే తెలంగాణ మార్చ్‌ ‘ను జయప్రదం చేయాలని కోదండరాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌, మాజీ ఎంపీ వినోద్‌ ఇతర ప్రముఖ టీఆర్‌ఎస్‌ నాయకులు హాజరయ్యారు.