ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌

‘స్వాతంత్య్ర’ వేడుకలకు ముందు హైజాక్‌ !
అల్లర్లు సృష్టించేందుకు ‘లష్కరే’ కుట్ర
నిఘా వర్గాల అనుమానాలు..
న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి): దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో భారత ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. అంతే గాక ఆదివారం నుంచి తనిఖీలు ముమ్మ రం చేసింది. అందులో భాగంగానే ఆదివా రంనాడు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు, విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు, విజయవాడ బస్టాండు, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిం చాయి. అప్రమత్తంగా ఉండాలని ఎయిర్‌ పోర్టు అధికారులకుఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే ఆగస్టు 15లోగా విమానాన్ని హైజాక్‌ చేయాలన్న లష్కర్‌ తోయిబా కుట్ర పన్నినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్‌ శాఖకు సమాచారం అందడంతో ప్రభుత్వం అలర్ట్‌ అయింది. అంతేగాక కుట్రను అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అమలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు ఐబీ కూడా వెల్లడించింది. దీంతో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద గట్టి భద్రతను చేపట్టారు. ఎయిర్‌పోర్టులు, తదితర ప్రాంతాల్లో సంచరించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.