ఎలక్ట్రానిక్‌ మీడియా సున్నితాంశాలను

చిలువలుపలువలు చెయ్యొద్దు
మార్చ్‌, నిమజ్జనంపై నగర పోలీస్‌ కమిషనర్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 (జనంసాక్షి):
ఈ నెల 30 నాటి తెలంగాణ మార్చ్‌ను శాంతిభద్రతల కోణంలోనే చూస్తామని నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ అన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులతో శర్మ మంగళవారంనాడు సమావేశమయ్యారు. ఈ నెల29న జరగనున్న గణేష్‌నిమజ్జనం, 30న జరగనున్న తెలంగాణ మార్చ్‌ నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియా
సంయమనంతో వ్యవహరించాలని అనురాగ్‌శర్మ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు సూచించారు. దూరంగా ఉండి దృశ్యాలను చిత్రీకరించుకోవాలని కోరారు. ఊహాజనిత వార్తలను ప్రసారం చేయొద్దన్నారు. సంచలనాల కోసం లేనిపోని కథనాలు కూడా ప్రసారం చేయరాదన్నారు. గణేష్‌ నిమజ్జనం, తెలంగాణమార్చ్‌ నేపథ్యంలో జంటనగరాల్లోని ప్రధానప్రాంతాల్లో భారీగా పోలీసులను మొహరింపజేయనున్నామన్నారు. తాను నిరంతరాయంగా పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ ఉంటానని కూడా చెప్పారు. ప్రజల క్షేమం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఇతర ప్రాంతాల పోలీసుల సేవలను కూడా వినియోగించుకుంటున్నామని చెప్పారు. గణేష్‌ నిమజ్జనాన్ని త్వరితంగా పూర్తి చేయాలని ఇప్పటికే మండపాల నిర్వాహకులకు, ఉత్సవ నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.