ఏ నేరం చేయకపోతే ఉలుకెందుకు?
– ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అంటే ఇదే
– ట్విట్టర్ వేదికంగా బాబుపై మండిపడ్డ కేటీఆర్
హైదరాబాద్, మార్చి5(జనంసాక్షి) : హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీ వ్యహారం తెలుగు రాష్ట్రాల్లో కొత్త వివాదాన్ని రాజేసింది. ఈ వివాదంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. ఏపీ సర్కార్ గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. టీ-సర్కారే తమ డేటాను చోరీ చేసిందని ఏపీ సర్కార్ ఎదురు దాడికి దిగింది. ఈ వ్యహారంపై అటు కేటీఆర్.. ఇటు చంద్రబాబు, లోకేష్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. తన ట్వీట్‌లో ‘విూరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు అంటూ ప్రశ్నించఆరు. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారని, కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు.. విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా విూ భయం చంద్రబాబు అంటూ నిలదీశారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపి ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఒక ప్రైవేటు కంపెనీకి చేరవేయటం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవటమే అవుతుందన్నారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విూద ఏడుపులు ఎందుకు బాబు అంటూ మరో ట్వీట్లో కేటీఆర్ విమర్శించారు.
ఐటీగ్రిడ్ వివాదంపై టీసర్కార్‌పై ట్వీట్ల యుద్దం..
ఇదిలా ఉంటే ఆంధప్రదేశ్, తెలంగాణ మధ్య ‘ఐటీ గ్రిడ్’ కంపెనీ వ్యవహారం కాకరేపుతోంది. ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేశారని ఈ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదుచేయగా, ఏపీ ప్రభుత్వ పెద్దలు దీనిపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ వ్యవహారంలో కొందరు అజ్ఞాత వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా సోషల్ విూడియాలో తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ముంబై, పూణెళి, బెంగళూరు, రాజస్థాన్ నుంచి ఈ ట్వీట్లు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ట్వీట్ల సంగతి ఏంటో చూడాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఏపీ-తెలంగాణ మధ్య వ్యవహారంపై ముంబై, బెంగళూరు, పూణెళి, రాజస్థాన్ నుంచి ట్వీట్లు రావడంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ ప్రజల సమాచారాన్ని అక్రమంగా సేకరించారని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2న సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ డైరెక్టర్ అశోక్ పరారీలో ఉన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ట్వీట్టలను టీడీపీ నేతలే డబ్బులిచ్చి చేయిస్తున్నట్లు తెరాస నేతలు పేర్కొంటున్నారు.