ఒక హక్కు – వంద ఆంక్షలు

అటవీశాఖ, పోలీస్‌శాఖ, కొన్ని సందర్భాల్లో గిరిజన సంక్షేమ శాఖ కూడా ఒక్కటై ఆదివాసుల ను అడవుల నుంచి బయటకు నెట్టేసి ఏ హ క్కులూ పొందకుండా చేసిన ఉదంతాలు కోకొ ల్లలు. అభయారణ్యంలోని భూముల్లో ఆదివాసుల కు రాష్ట్ర ప్రభుత్వం సాగు హక్కు కల్పించాలని నిర్ణయించిందన్న వార్త అమాయకులకు సంతోషం కలిగించి ఉండవచ్చు గానీ, వాస్తవాలు తెలిసిన వారికి మాత్రం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలంటూ పత్రికల్లో వచ్చే వార్తలను అనుమానంగా చూసే ఆరోగ్య సూచకమైన లక్షణం ప్రజలకు ఇప్పటికే అలవడిం ది గానీ, పత్రికలు తెలివిగా వ్యాఖ్యానిస్తున్నామను కుంటూ, వాటికి లేనిపోని విశ్వసనీయత కల్పిస్తు న్నాయి. ఎన్నికలు దగ్గరికొచ్చాయి కాబట్టి ప్రభు త్వం ఆదివాసులపైన వరాల జల్లు కురిపిస్తున్నదని పత్రికలు వ్యాఖ్యానించడం, మీడియా ఇంటర్వ్యూ కు ప్రయత్నించే ప్రతిపక్ష నాయకులు దానిని అందుకుని ఎన్నికలొచ్చినప్పుడే అడవివాసులు జ్ఞా పకం వస్తారా అని ఆవేశంగా పునరుచ్ఛరించడం, అది నిజమేమోనన్న అభిప్రాయం కలిగించి ఉంటాయి.
మొదటి వాస్తవమేమిటంటే ప్రభుత్వం ఈ విషయంలో తీసుకోవలసిన నిర్ణయమేదీ లేదు. ఆ నిర్ణయం దేశ పార్లమెంటు తీసేసుకుంది. అభ యారణ్యాలతో సహా సకల ఆరణ్యాలలోనూ ఆది వాసులకు, మూడుతరాలుగా అడవివాసులుగా ఉన్న ఇతర ప్రజలకు సాగు హక్కులతో సహా సకల వినియోగ హక్కులు కల్పిస్తూ పార్లమెంటు చట్టం చేసింది. ఆదివాసుల, ఇతర సంప్రదాయక అటవీవాసుల (అటవీ హక్కుల చట్టం పరిరక్షణ) చట్టం అని పేరుపెట్టిన ఈ శాసనాన్ని క్లుప్తంగా అటవీ హక్కుల చట్టం అని పిలుస్తున్నారు. మన పాలకులు ఎప్పటికప్డుడు గొప్ప పనులు చేస్తున్నట్టే వ్యవహరిస్తారు తప్ప ఆత్మ విమర్శ చేసుకోరు.
ఆ విషయంలో ఇది అసాధారణమైన వలస పాలనలోనూ, ఆ ఆరువాత కూడా అడవులను పరిరక్షించే ప్రక్రియ అటవీ భూముల్లో తరతరాలు గా నివసిస్తున్న ప్రజల హక్కులను గుర్తించడంలో విఫలమయిందని, అడవివాసులకు అన్యాయం చేసిందని ఈ చట్టం ఉపోద్ఘాతంలో రాసారు. ఆ సత్వాన్ని గుర్తించి ఈ చట్టాన్ని చేశామన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిందేముంది ? పార్ల మెంట్‌ చేసిన చట్టాన్ని గుర్తిస్తున్నామని నిర్ణయం చేశారా?
కొన్ని చట్టాలు ఎప్పుడు అమలులోకి వస్తా యనేది ఆ చట్టంలోనే రాసి ఉంటుంది. కొన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చినపుడు అమలవుతా యని రాసి వుంటుంది. పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాన్ని కూడా కార్యనిర్వహకశాఖ ఈ అవకాశాన్ని వాడుకుని అమలులోకి తీసుకురా కుండా ప్రభుత్వం తీసుకొచ్చినపుడు అమలవుతుం దని రాయడం వెనుక, ఒక సంవత్సరం దానిని అమలులోకి తీసుకరాకపోవడంతో హక్కులను గుర్తించే ఈ చట్టమంటే చాలా మందికి ఇష్టం లేదు.
ఆదివాసులకు అడవుల్లో ఉమ్మడి ఫలసేకరణ హక్కు ఇస్తే ఫరవాలేదుగానీ, వ్యక్తిగత సాగు హ క్కు ఇస్తే అడవులు నాశనం అయిపోతాయని, వ న్య ప్రాణులు అంతరించిపోతాయని పర్యావరణ వాదులు అభ్యంతరం పెడుతూ వచ్చారు. అడవుల ను పొలాలుగానూ, ఆ పైన నగరాలుగానూ మా ర్చి భూముల్లో ఇళ్లలో కార్లలో అన్నింటిలోనూ మా సొంత యాజమాన్య హక్కు కల్పించిన నాగ రికతకు వారసులైనవారు ఆదివాసులకు మాత్రం తాము సాగు చేసుకుంటున్న భూములపైన హక్కు లు ఇవ్వొద్దనడం ఏ రకమైన నీతో అర్థంకాదు. ఆదివాసులు బతికే స్థాయిలో అడవుల్లో వ్యవసా యం చేసుకుంటే అడవులూ అంతరించిపోవు, వన్య మృగాలూ అంతరించిపోవు.
అంతకు మించిన స్థాయిలో వినియోగాన్ని పెంచిన నాగరికతే ప్రకృతి క్షీణతకు కారణమ యింది. దానిని ఏ మాత్రం తగ్గించుకోవడానికి సిద్ధపడని వారు నోరులేని ప్రజల మీద ఆం్షలు పెట్టడం దుర్మార్గం ఆలోచనయితే కావచ్చును గానీ, దీనికి బలమైన అండ దొరికింది. వేరెవరో కాదో సాక్షాత్తు భావి భారత ప్రధాని అని వార్తలు వస్తున్న రాహుల్‌ గాంధీ ఈ వికృత పర్యావరణ వాదానికి మద్దతుగా నిలిచాడు. అతను గణతం త్య్ర దినోత్సవం నాడు ఢిల్లీ నగర వీధుల్లో తలలో ఈకలు పెట్టుకుని నృత్యాలు చేసే ఆదివాసీ బృం దాలను కాక వేరే అడవివాసులను ఎప్పుడయినా చూసాడో లేదో తెలీదు.
అయినప్పటీకీ, హక్కుల చట్టం అమలులోకి వస్తే ఆదివాసులను అడ్డం పెట్టుకుని వన్యమృగాల వేటగాళ్లు యథేచ్ఛగా సంచరిస్తారన్న అభ్యంతరా నికి అతను గొంతు కలిపాడు. అటవీ శాఖకు ఈ చట్టం అంటే ఇష్టం లేదు. వాళ్లకు చెట్టంటే ప్రేమ ని కాదు. డబ్బులిచ్చి చెట్లు కొట్టుకుపోతే చూస్తూ ఉండే ఆచారం అటవీ శాఖలో అనాదిగా ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు అటవీ సంరక్షణకు భారీగా నిధు లు గుమ్మరిస్తున్నాయి. వారికి సహితం చెట్టంటే ప్రేమని కాదు. విపరీతమైన పర్యావరణ క్షీణతకు కారణమైన పాశ్చాత్య జీవన శైలిని, దానిని అనురించే మనబోటి దేశాల ధనిక వర్గాల జీవన శైలి చెక్కుచెదరకుండా కాపాడుతూ (దానిపైన చాలా పెట్టుబడుల భవిత్యం ఆధారపడి ఉంది కాబట్టి) పర్యావరణ సమతుల్యత మరీ దెబ్బ తినకుండా చేసుకోవాలంటూ, ఇంకా మిగిలి ఉన్న అడవులను పదిలంగా కాపాడడం అవసరమన్న గుర్తింపే ఈ నిధుల ప్రవాహానికి కారణం.
ఇట్లాగయితే భారత ఆర్థిక వృద్ధిరేటు సింగ పూర్‌నో, చైనానో ఎన్నడు దాటేను ? ఇన్ని అభ్యం తరాల నడుమ ఒక్క సంవత్సరం ఆలస్యంగానైన అటవీ హక్కుల చట్టం అమలులోకి వచ్చిందంటే ఆశ్చర్యమే. దాని పూర్తి కథ బయటి కొచ్చిన రోజు ఎవరిని అభినందించాలో తెలుస్తుంది. చివరి వాస్తవమేమిటంటే ఈ సంవత్సర కాలంలో ఈ చట్టం అమలుకు గండికొట్టే ప్రయత్నం మన రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాలోనూ జరిగింది. అడవుల్లో ఉంటూ హక్కులు అనుభవిస్తూ ఉంటే కదా ఈ చట్టం ఫలితం పొందేది ? అది అమలు లోకి వచ్చే లోపల అడవులు ఖాళీ చేయించేస్తే అమలులోకి వచ్చిన తరువాత గుర్తింపు పొందడా నికి ఏం హక్కులు ఉంటాయి? మన రాష్ట్రంలోని నల్లమల అడవులు నుంచి చెంచులను బయటకు తరిమేసే ప్రక్రియ ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమో దించిన తెల్లవారు మొదలయింది. నిన్న మొన్నట ిదాకా కొనసాగింది. అడవుల్లో ఉంటే మీ ఇళ్లు కాల్చేస్తాం అని పోలీసులు బెదిరించారు. ఇక్కడ ఒకరూ అక్కడ ఒకరూ ఉంటే మీకు సేవలు అం దించంలేం, ఒక దగ్గరకు రండి అని ఇతర ప్రభు త్వ శాఖలు ఒత్తిడి పెట్టాయి. నల్లమల అడవుల్లో దాదాపు 40 వేల మంది చెంచులు ఉంటారని అంచనా. ఈ రోజు వారికి అభయారణ్యంలో సా గు హక్కులు కల్పిస్తామంటున్న ప్రభుత్వం ఆ హ క్కును గుర్తించిన చట్టాన్ని పార్లమెంటు ఆమోదిం చిన తరువాత, దాని అమలు మొదలయ్యే లోపల, వారందరినీ అడవి నుంచి బయటకు తరిమేసే ప్ర యత్నం గట్టిగా చేసింది. కొన్ని వేల మంది బయ టికొచ్చేశారు. లేదా అడవిలోనే తమ భూములు వదులుకోనో అప్పారావు వంటి సాపేక్షంగా పెద్ద దయిన ఊర్లలో చేరారు.
అక్కడ కట్టిస్తామని హామీ ఇచ్చిన ఇళ్లు లేవు. డబ్బులిస్తామని హామీ ఇచ్చిన భూములు లేవు. ఇప్పుడు అమలులోకి వచ్చిన అటవీ హక్కుల చట్టం వారి హక్కులకిచ్చే గుర్తింపును పొందే అవ కాశమూ లేదు. వారు వదిలిపెట్టి వచ్చిన భూము ల్లో అటవీ శాఖ మొక్కలు నాటేసి ప్లాంటేషన్‌ చేపట్టిన సందర్భాలు సహితం ఉన్నాయి. ఖమ్మం జిల్లా భద్రచలం డివిజన్‌లో ఛత్తీస్‌గఢ్‌్‌ నుంచి సల్వాజుడుం దెబ్బకు పారిపోయి వచ్చి అడవుల్లో ఆవాసాలు ఏర్పరచుకున్న గొత్తి కోయల గుడిసె లను అటవీ శాఖ పదే పదే తగలబెట్టిన ఘటనలు అనేకం జరిగాయి. సల్వాజుడుం ప్రారంభమయిం ది 2005 జూన్‌లో. దంతెవాడ జిల్లాలోని అడవి ప్రాంత ఆదివాసులను బల ప్రయోగంతో రహదా రి శిబిరాల్లోకి తరలించే ప్రయత్నం సల్వా జుడుం చేసింది. దానికి తలొగ్గడం ఇష్టంలేని ఆదివాసి కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఖమ్మం జిల్లాలోకి పారిపోయి వచ్చి అడవుల్లో గుడిసెలు వేసుకుని పరిసర గ్రామాల్లో కూలీ చేసుకొని బతకసాగాయి. ఈ కుటుంబాల వారు దాదాపు పది వేల మంది ఉంటారని అంచనా. ఎక్కువ భాగం 2005 జూన్‌ డిసెంబర్‌ మాసాల మధ్య పారిపోయి వచ్చారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్‌ 13 నాటికి అడవుల్లో ఆదివాసులు అనుభవిస్తున్న హక్కులకు గుర్తింపు లభిస్తుంది.
కాబట్టి ఆ చట్టం అమలులోకి వచ్చే లోపల వారి ఆవాసాలను తగులబెట్టి ఛత్తీస్‌గఢ్‌కు తరిమే స్తే వారి బెడద పోతుందని భద్రాచలం అటవీశాఖ అధికారులు భావించారు. పదేపదే ఇళ్లు కాలబె ట్టారు. ఈ రోజు అభయారణ్యల్లో సహితం ఆదివా సులకు సాగుహక్కు కల్పిస్తామంటున్న ప్రభుత్వాని కి ఒక ప్రశ్న అడగాలి. ప్రకాశం, మహబూబ్‌నగర్‌ ల నుంచి ఖమ్మం దాకా, చెంచుల నుంచి గొత్తి కోయల దాకా, బలవంతంగా అడవులను ఖాళీ చేయించిన ఆదివాసి కుటుంబాలన్నీ తిరిగి తమ ఊళ్లకు పోయి తమ భూముల్లో అటవీ శాఖ మొ క్కలు నాటి ఉంటే వాటిని పీకేసీ ఎప్పటిలాగే సాగు చేసుకుని బతకవచ్చునన్న బహిరంగ ప్రకటన చేస్తారా ?
ఆదివాసుల అడవి హక్కులను గుర్తించే ఈ చట్టమంటే చాలా మందికి ఇష్టం లేదు. అడవుల్లో ఉమ్మడి ఫలసేకరణ హక్కు ఇస్తే ఫరవాలేదు గానీ, వ్యక్తిగత సాగు హక్కు ఇస్తే అడవులు నాశనం అయిపోతాయని అభ్యంతరం పెడుతూ వచ్చారు.

– కె.బాలగోపాల్‌ఉద్యమం నిలిచింది