ఓటమి భయంతోనే రైతుబంధును ఆపిండ్లు..!

మంథని, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి భయంతోనే రైతుబంధును అపిండ్లని, బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌కు రైతులు అండగా నిలుస్తున్నారని ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసి రైతుబంధును నిలిపివేయించారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు. మంగళవారం మంథని మండలం లక్కేపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనాడు పంటలు సాగు చేసే రైతుల అవసరాలకు ఉపయోగపడే రైతుబంధును ఆపివేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు, రైతులు గమనించాలన్నారు. రైతుబంధు ఆపిన కాంగ్రెస్‌ పార్టీ రైతులకు క్షమాపణలు చెప్పి తప్పు చేశామని ఒప్పుకోవలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలను విస్మరిస్తూన్న కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ఏనాడు ప్రజల గురించి ఆలోచన చేయని పార్టీ కాంగ్రెస్‌ అని ఆయన విమర్శించారు. మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా చెప్పుకునే మంథని కాంగ్రెస్‌ అభ్యర్థి ఈనాడు ఒకరి కాళ్ల కింద ఫోటో పెట్టుకునే స్థాయికి దిగజారిపోయారని, మంథనిలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని అంగీకరించినట్లేనని బావించవచ్చన్నారు. ఎన్నికలకు ముందు ఒక పార్టీ, ఎన్నికల తర్వాత ఒక పార్టీ మారీ తన గోల్‌ ఏంటో తెలియని విజయశాంతి మంథనికి వస్తే తప్ప తాను గెలువననే భయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. మంథనిలో బారీ మీటింగ్‌ పెట్టి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారని, ఆ ఖర్చుకు అయ్యే పైసలను ప్రజలను ఇస్తే బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడినాయకులకు ప్రజలు అవసరం లేదు కానీ వాళ్ల ఓట్లు మాత్రమే కావాలని ఆయన దుయ్యబట్టారు. ఈనాడు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనీఫెస్టో ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలు నమ్మడం లేదని, జగిత్యాలతో జీవన్‌రెడ్డి బాండ్‌ పేపర్ల మీద సంతకాలు పెడుతున్నారని, ఇక్కడి అభ్యర్థి ప్రజలను నమ్మించేలా ఏం చేస్తారోనని ఆయన ప్రశ్నించారు. ఓటమి భయంతో రైతుబంధును ఆపారే కానీ కరెంటు, నీళ్లను ఆపగలుగుతారా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ అభ్యర్థిపై సమగ్రంగా ఆలోచన చేయాలని, కాంగ్రెస పార్టీని రైతులు ఎక్కడికక్కడ కట్టడి చేసి మీ బిడ్డగా తనను ఆదరించి బీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలువాలని ఆయన కోరారు.