ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింకు

హైదరాబాద్ జ‌నంసాక్షి :  ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింకుపెట్టే కార్యక్రమం మళ్లీ మొదలుకానుంది. దీనిపై రేపు నగరంలోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించే వర్క్‌షాప్‌కు ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మ హాజరవుతున్నారు. వర్క్‌షాప్ సందర్భంగా ఆధార్-ఓటర్ కార్డులను అనుసంధానం చేసే కార్యక్రమంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటికి ముందే కొన్ని ప్రాంతాల్లోనైనా ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డుల అనుసంధానం పూర్తిచేసే వీలుంది.
ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో లింకుచేయడం ద్వారా బోగస్ ఓట్లు, డూప్లికేట్లను సమర్థవంతంగా ఏరివేయవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. నగరంలో ప్రతిసారీ ఎన్నికల్లో 50నుంచి 52శాతానికి మించి పోలింగ్ నమోదు కాకపోవడానికి డూప్లికేట్లు, బోగస్ ఓటర్లే కారణమని అధికారులు బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ కార్డులను లింకు చేయడం ద్వారా బోగస్ ఓట్లను, డూప్లికేట్లను ఏరివేయ వచ్చని నిర్ణయించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజక్టు కింద చేపట్టేందుకు మన నగరాన్నే ఎంపికచేసింది.
ఇందులో భాగంగా గత సాధారణ ఎన్నికలకు ముందు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పదిహేను పోలింగ్ కేంద్రాల్లో పైలెట్ ప్రాజక్టు కింద ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ను లింక్‌చేసేందుకు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయి. చాలా ప్రాంతాల్లో ఆధార్ కార్డులో ఉన్న పేర్లు, ఇతర వివరాలకూ ఓటరు గుర్తింపు కార్డులోని వివరాలకు పొంతన కుదరలేదు. పెద్ద సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు కూడా బయటపడ్డాయి.
చాలాచోట్ల ఆధార్‌లోని చిరునామాకు, ఓటరు కార్డులోని చిరునామాకూ వ్యత్యాసాన్ని కనుగొన్నారు. దీంతో ఆధాక్ ఆధారంగా ఓటరు గుర్తింపు కార్డులు రద్దుచేయడమే, ఓటుహక్కును లేకుండా చేయడమో సాధ్యంకాదని నిశ్చయించారు. అయినా ఆధార్‌తో కనీసం డూప్లికేట్లకు అడ్డుకట్ట వేయవచ్చని నిర్ణయించిన అధికారులు ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నగరంలో వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు, గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై వచ్చే సోమవారం ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియపై గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎంత జనాభాకు ఎన్ని వార్డులు చేయవచ్చో సమగ్ర నివేదిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.