ఓటిటి,గేమింగ్‌కు పెరుగుతున్న ఆదరణఇండియా జాయ్‌ కార్యక్రమంలో కెటిఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ):

తెలంగాణ విజువల్‌ ఎఫెక్ట్స్‌, యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇండియా జాయ్‌ పేరుతో విూడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇండియా జాయ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు దేశం నలుమూలల నుంచి గేమింగ్‌, యానిమేషన్‌ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫెస్టివల్‌ ఇది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఇండియా జాయ్‌ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమం అని కొనియాడారు. దేశంలో రోజురోజుకు ఇంటర్నెట్‌ యూజర్లు పెరిగిపోతున్నారు. ఇమేజ్‌ సెక్టార్‌ ఏడాదికి 13.4 శాతం పెరుగుతోందని అంచనా ఉన్నట్లు పేర్కొన్నారు. ఓటీటీ, గేమింగ్‌కు ఆదరణ పెరుగుతోందన్నారు. నేను కూడా ఓటీటీకి అభిమానిని అని తెలిపారు. వీక్షకులకు వినోదం ఇవ్వడంలో ఓటీటీ విజయవంతమైందన్నారు. రెండేండ్లలో కొత్తగా 10 వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు కొలువుదీరాయని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 80 వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు ఉన్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా నగరంలో అనేక గేమ్స్‌ రూపొందాయన్నారు. ఇమేజ్‌ టవర్‌ను 2023లో ప్రారంభించేలా కృషి చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు.