ఓటిప్పుడు చాలా కాస్ల్టీ గురూ! ప్రచారానికి తెర- ప్రలోభాలకు ఎర

– కట్టలు తెంచుకున్న నోట్లు

– ఏరులై పారుతున్న మద్యం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది.  డబ్బు,మద్యం,నగలు, ఇతర వస్తుసామగ్రితో ఓటర్లను ఎరవేసేందుకు   వివిధ రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. డబ్బు పంపిణీ జోరుగా సాగుతున్నాయి. ఓటమి నుంచి ఎలాగైనా బయటపడాలని తదితర పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు పోటాపోటీగా డబ్బు పంపిణీకి సిద్ధపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధగా ఈ సారి ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపకాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. పోలింగ్‌ నాటికి ఇంకా భారీ మొత్తంలో డబ్బు,మద్యం పంపకాలకు ఏర్పాట్లు చేశాయి. ఇప్పటి వరకు   42 కోట్ల రూపాయల మేరకు నగదుతోపాటు 13 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, ఇతర వస్తువులు, రెండు లక్షల లీటర్ల మద్యం పటుబడటం ఇందుకు ఆస్కారం కలిగిస్తోంది. గతంలో ఇంత భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవని  ఎన్నికల సంఘం అధికారులే స్వయంగా పేర్కొనడం గమనార్హం.నమూనా బ్యాలెట్‌ పత్రంతోపాటు ఐదు వందల నోటు ఇస్తూ అభ్యర్థులు ప్రచారం సాగించినట్టు వార్తలు వచ్చాయి. పరకాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఓటర్లకు నోట్లు పంచుతూ ఓ టీవీ కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఓ బీజేపీ నేత సంగెం మండలం గవిచర్ల ఎస్సీ కాలనీలో ఓటర్లకు డబ్బు పంచుతుండగా తెలంగాణవాదులు పట్టుకుని నిర్బంధించారు.అలాగే అనేక ప్రాంతాల్లోనూ డబ్బు, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో డబ్బు,మద్యం పంపిణీని  ఎన్నికల అధికారులు ఏ మేరకు అడ్డుకోగలుగుతారో వేచిచూడాల్సిందే.