కబ్జాకు గురవుతున్న చెరువు శిఖం – చోద్యం చూస్తున్న అధికార గణం
జగదేవ్ పూర్, మార్చి 25 (జనంసాక్షి): పచ్చని పంట పొలాలకు సాగునీరు అందించే ఆ చెరువు నేడు కబ్జాకు గురవుతుంది. దీంతో చెరువు పరిధిలోని పంట భూములు పచ్చని పైరులతో కళకళలాడే పరిస్థితులు క్రమంగా కనమరుగయ్యే దుస్థితి నెలకొంటుంది. రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు రోజు రోజుకు పెరగుతుండడంతో సులభంగా సంపాదించడానికి అలవాటు పడిన కొంతమంది దళారులు ప్రభుత్వ భూములను కూడా యధేచ్చగా కబ్జా చేస్తున్నారు. కాగా ప్రభుత్వ భూములను కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లోని అంబారెడ్డి చెరువు శిఖం భూమిని ఒక రైతు తన ఇష్టారీతిగా కబ్జా చేస్తున్నట్లు పరిసర ప్రాంతాల రైతులు ఆరోపిస్తున్నారు. అంబారెడ్డి చెరువు శిఖం 40.27 ఎకరాలు కాగా ఆయకట్టు 51ఎకరాలు, ఎఫ్ టి ఎల్ (ఏక్ ఫసలీ) భూములు 21 ఎకరాలు అంటే చెరువులో మునిగిన పట్టా భూములు కూడా తేలిన తర్వాతనే సాగు చేసుకునే హక్కుకలిగినవి. అయితే అంబారెడ్డి చెరువు సమీపంలోని సర్వేనంబర్ 269 లో రియల్ ఎస్టేట్ దళారుల ద్వారా కొంత భూమిని కొనుగోలు చేసిన ఒక రైతు చెరువు శిఖం భూమిని సైతం కబ్జా చేస్తున్నాడని తెలిసింది. కొనుగోలు చేసిన భూమిని సాగుకు చదును చేస్తున్నాననే సాకుతో జేసిబి, హిటాచి యంత్రాలను ఉపయోగించి దళారుల అండదండలతో దాదాపు 3 ఎకరాలకు పైగా చెరువు శిఖం భూమిని కబ్జా చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తాను కొనుగోలు చేసిన పట్టాభూమికి ఆనుకొని ఉన్న అంబారెడ్డి చెరువులోకి పెద్ద పెద్ద బండరాల్లను దొర్లించి మట్టిని పోసి కబ్జా చేసుకుంటున్నాడు. అదేవిధంగా చెరువు సమీపంలోని జీడిగుట్టను సైతం తొలిచి వేస్తూ తన పట్టా భూమిలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చెరువు శిఖం భూములు కబ్జాలకు గురవుతుంటే భవిష్యత్తులో చెరువులు మాయమయ్యే పరస్థితులు సంభవిస్తాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి మండల కేంద్రంలో చెరువు శఖం భూమి కబ్జాకు గురవుతుండగా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి అంబారెడ్డి చెరువు కబ్జాదారుల కబందహస్తాల నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం: తహశీల్దార్ రఘువీరారెడ్డి
అంబారెడ్డి చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతున్నట్లు తమ దృష్టికి రాలేదని వెంటనే రెవెన్యూ, సంబధిత శాఖ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ జి.రఘువీరారెడ్డి పేర్కొన్నారు.